Elon Musk Twitter: ట్విట్టర్ యజమానిగా మారిన వెంటనే సంస్థలో దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రణాళికలు వేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని ట్విట్టర్ కొనుగోలుకు కావాల్సిన నిధుల్ని సమీకరించే సమయంలో పెట్టుబడిదారులతో చెప్పారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఫలితంగా కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగుపడుతుందని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపింది.
ప్రస్తుతం ట్విట్టర్లో 7,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 75 శాతం మందిని తొలగిస్తే కేవలం కీలక వ్యక్తులు మాత్రమే మిగిలిపోతారు. వాస్తవానికి ట్విట్టర్ ప్రస్తుత యాజమాన్యం సైతం ఉద్యోగుల్ని తగ్గించుకునే యోచనలో ఉంది. ఇప్పటికే కొత్త నియామకాల్ని వాయిదా వేసింది. అయితే, ఇంత భారీ ఎత్తున కోత ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. కొనుగోలు ఒప్పందం ఖరారైన సమయంలోనూ మస్క్ ఉద్యోగాల కోతపై మాట్లాడారు. కానీ, ఎంత మొత్తం అని మాత్రం ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు.
ఈ కథనాలపై ట్విట్టర్ స్పందించింది. ప్రస్తుతానికి ఎలాంటి తొలగింపు ఉండబోదని ఉద్యోగులకు హామీ ఇచ్చింది. కొనుగోలుదారుల నుంచి సైతం అలాంటి ప్రతిపాదనలేమీ రాలేదని పేర్కొంది. అయితే, కొనుగోలు ఒప్పందం అమలు కావడానికి ముందు ఇలాంటి ఊహాగానాలను మరిన్ని వినేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని అప్రమత్తం చేసింది.
ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, నకిలీ ఖాతాల విషయంలో ట్విట్టర్ యాజమాన్యం తప్పుడు లెక్కలు చూపిందంటూ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ప్రకటించారు. దీనిపై ట్విట్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇరు వర్గాలు ఏదో ఒక నిర్ణయానికి రావాలని డెలావెర్ న్యాయమూర్తి ఆదేశించారు. దానికి అక్టోబరు 28 వరకు సమయం ఇచ్చారు. ఆలోపు ఏ నిర్ణయానికి రాలేకపోతే.. నవంబరు నుంచి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: HCL శివ్ నాడార్ విరాళం రోజుకు రూ.3 కోట్లు.. తర్వాత స్థానాల్లో ముకేశ్, ప్రేమ్‌జీ.. మరి అదానీ?
'వర్క్ ఫ్రమ్ హోం'తో ఉత్పాదకత పెరిగింది.. కానీ..: సత్య నాదెళ్ల