Digital Payments Security Tips : నేడు ఆర్థిక లావాదేవీలు జరపడానికి చేతిలో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మొబైల్ ఫోను ఉంటే చాలు, సింపుల్‌గా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేయవచ్చు. ఇలాంటి ఆన్లైన్, డిజిటల్ చెల్లింపుల్లో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ మోసాలు భారీగా పెరుగుతున్నాయి. దీనితో మన కష్టార్జితాన్ని ఆన్లైన్ మోసగాలు దోచుకుంటున్నారు. అందుకే డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు దాదాపుగా 155 కోట్ల రూపాయలను దోచుకున్నారు. భయంగొలిపే విషయం ఏమిటంటే, క్రెడిట్ కార్డుల వినియోగంపై, డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఉన్నవారిని సైతం సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు.
నగదు రహిత చెల్లింపులు అనివార్యం అవుతున్న నేటి కాలంలో సైబర్ మోసగాళ్లు, సామాన్యులను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. నగదు ఆశ చూపించి, అశ్లీల చిత్రాలను పంపించి, బెదిరించి అమాయకుల నుంచి డబ్బును దోచుకుంటున్నారు. అలాగే వైరస్లు పంపించి, కూడా వ్యక్తుల డేటాను, వారి బ్యాంకు అకౌంట్ల వివరాలను కాజేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే మనమే అప్రమత్తంగా ఉండాలి.
బ్యాంకుల నుంచి ఫోన్స్ వస్తున్నాయా?
బ్యాంకులు సాధారణంగా ఏడాదికోసారి నిబంధనలు మారుస్తుంటాయి. ఇలాంటి సమయంలో కేవైసీ చేసుకోవాలని సూచిస్తుంటాయి. దీనిని కూడా సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. వీరు బ్యాంకుల పేరు మీద మిమ్మల్ని సంప్రదిస్తారు. కేవైసీ, రీ-కేవైసీ చేసుకోమని అడుగుతారు. తాము పంపించిన లింక్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతారు. పొరపాటున వీటిని నమ్మారో, ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లోని సొమ్ము మొత్తాన్ని కాజేస్తారు. మీరు కేవైసీ చేయాలని అనుకుంటే, నేరుగా బ్యాంకు బ్రాంచ్‌లకు వెళ్లండి. లేదంటే, బ్యాంకు అధికారిక వెబ్సైట్లో చేయండి. అంతేకానీ, ఇతరులు పంపించిన లింక్‌లను మాత్రం ఓపెన్ చేయకండి. ఒక వేళ ఓపెన్ చేసినా, అందులో మీ వివరాలు నమోదు చేయకండి.
క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు చెప్పవద్దు!
మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను ఇతరులకు చెప్పకూడదు. ముఖ్యంగా సీవీవీ, ఓటీపీ, పాస్వర్డ్ వివరాలు ఎవరికీ తెలియనీయకూడదు. ఏ మాత్రం అనుమానం కలిగినా, వెంటనే బ్యాంకును సంప్రదించాలి.
రివార్డు పాయింట్ల కోసం మీ వివరాలు చెప్పవద్దు?
డెబిట్, క్రెడిట్ కార్డులను వాడేటప్పుడు, వాటిపై రివార్డు పాయింట్లు వస్తుంటాయి. వీటి గడువు కొన్నాళ్లకు తీరిపోతుంది. దీనిని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు, సామాన్యులను మోసం చేస్తున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని అంటూ, రివార్డు పాయింట్లను గడువులోగా వాడుకోవాల్సిందిగా చెబుతారు. ఒక వేళ గడువు పెంచాలంటే, మీ బ్యాంకు అకౌంట్ వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పాలని అడుగుతారు. మీరు పొరపాటున కూడా ఆ విషయాలు చెప్పకూడదు. ఒక వేళ పొరపాటున ఓటీపీ లాంటి సున్నితమైన వివరాలు కూడా చెప్పారంటే, మీ రివార్డు పాయింట్లతో వాళ్లు కొనుగోళ్లు చేసి లబ్ధి పొందుతారు. అందుకే మీ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. వాటిని సందర్భానికి తగిన విధంగా వాడుకోవాలి. సాధారణంగా ఈ పాయింట్ల గడువును బ్యాంకులు పెంచవు. కనుక, రివార్డ్ పాయింట్స్ గడువు పెంచుతామని వచ్చే సందేశాలను నమ్మవద్దు.
తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటే నమ్మవద్దు!
కేటుగాళ్లు మనల్ని ఆశపెట్టి మోసం చేస్తుంటారు. వేల రూపాయల విలువైన వస్తువును, చాలా చౌకగా మీకు ఇస్తామని చెబుతారు. దీని కోసం ముందుగా డబ్బులు చెల్లించాలని అంటారు. దీని కోసం తాము పంపించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, డబ్బులు చెల్లించాలని అడుగుతారు. పేమెంట్ త్వరగా చేయమని మిమ్మల్ని తొందరపెడతారు. కానీ ఇలాంటి వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు.
గర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు డబ్బు పంపించేందుకు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, పిన్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ డబ్బు మీ అకౌంట్లోకి రావాలంటే, ఎలాంటి కోడ్‌ను స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ మీరు కొనుగోలు చేయని వస్తువు గురించి ఎవరైనా ఫోన్ చేస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఆ కాల్‌ను కట్ చేయాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- మనం ఎప్పుడూ అధికారిక యూపీఐ యాప్‌లనే ఉపయోగించాలి. అప్పుడే మన ఆర్థిక సమాచారం సురక్షితంగా ఉంటుంది. నేడు చాలా బ్యాంకులు తమ యాప్‌ల నుంచి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, పేమెంట్స్ చేసే వీలును కల్పిస్తున్నాయి. సాధ్యమైనంత వరకూ వీటిని ఉపయోగించడమే మేలు.
- ఆన్లైన్ చెల్లింపుల కోసం కచ్చితంగా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సులభమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోకూడదు. అలాగే పాస్వర్డ్ లేదా పిన్ నంబర్లను తరచుగా మారుస్తుండాలి. అలా వీలుకాకపోతే, కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారైనా వాటిని మారుస్తూ ఉండాలి. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటారు.
- బ్యాంకింగ్, యూపీఐ యాప్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై, ఫ్రీ వైఫైలను వాడకూడదు. ఎందుకంటే, హ్యాకర్లు చాలా సులువుగా పబ్లిక్ వైఫైలను హ్యాక్ చేయగలుగుతారు. దీనితో మీరు ఆర్థికంగా నష్టపోతారు.
- పేమెంట్స్ కోసం మొబైల్ యాప్స్ ఉపయోగిస్తుంటే, కచ్చితంగా రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీల కోసం బయోమెట్రిక్స్ ఉపయోగించాలి.
- క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి వచ్చినప్పుడు, సంబంధిత దుకాణదారుని పేరు లేదా వ్యక్తిపేరు అడిగి తెలుసుకోవాలి. వారు ధ్రువీకరించిన తరువాతనే పేమెంట్ చేయాలి. అప్పుడే మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు.
మీ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చే టాప్-10 లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవే!
టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల లభించే బెస్ట్ బెనిఫిట్స్ ఇవే!