Demat Nomination Last Date : మీ డీమ్యాట్ ఖాతాకు నామినీని యాడ్ చేశారా? లేదంటే త్వరపడండి. సెప్టెంబర్ 30తో నామినీ ఏర్పాటు గడువు ముగుస్తోంది. ఈ లోపున గనుక మీరు నామినీని ఏర్పాటుచేసుకోకపోతే.. మీ అకౌంట్ (ఫ్రీజ్) స్తంభించిపోతుంది. వాస్తవానికి డీమ్యాట్ ఖాతాకు నామినీని యాడ్ చేయడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. ఇందుకోసం మొదటిసారి 2023 మార్చి 31 వరకు ఓ డెడ్‌లైన్ విధించింది. కాగా, పలు కారణాలతో ఈ గడువును మరలా సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
ఇది కారణం!
Demat Account Nominee SEBI : జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేటప్పుడు ఎలాగైతే నామినీలను ఏర్పాటుచేసుకుంటామో.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు వాడే డీమ్యాట్ అకౌంట్‌కు కూడా అలానే నామినీని ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే, పెట్టుబడి పెట్టిన వ్యక్తికి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే.. అతని/ఆమె ఖాతాలో ఉన్న పెట్టుబడులను, ఫండ్ యూనిట్లను వారసులు క్లెయిం చేసుకోవడం కష్టం అవుతుంది. ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే నామినీ వివరాలను జతచేయటం తప్పనిసరిచేస్తూ సెబీ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం డీమ్యాట్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నామినీని ఏర్పాటుచేసుకోవాల్సిందే.
మీకు ఇష్టం లేకపోతే ఇలా కూడా చేయవచ్చు!
Demat Account Nominee Options : సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డీమ్యాట్ ఖాతాకు సంబంధించి నామినీ వివరాలను అందించాల్సిన సెక్షన్లలో రెండు ఆప్షన్లు తీసుకొచ్చింది. 1. నామినీ వివరాలను నమోదు చేసుకునే ఆప్షన్ 2. నామినీని ఎంచుకోవడం లేదు అనేది. వీటిల్లో ఖాతాదారులు తమకి నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకొనే వెసులుబాటు ఉంది. అయితే, రెండింటిలో ఏదో ఒక దాన్ని మాత్రం కచ్చితంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణంచేత నామినీని ఏర్పాటుచేసుకోకపోతే.. సదరు వ్యక్తి డీమ్యాట్ ఖాతాను స్తంభింపజేస్తారు.
వ్యక్తులను మాత్రమే నామినీలుగా!
- డీమ్యాట్ ఖాతాను సింగిల్‌గా లేదా జాయింట్‌గా.. ఎలా తెరిచినా నామినీ వివరాలను జత చేయవచ్చు.
- కేవలం వ్యక్తులను మాత్రమే నామినీలుగా ఎంచుకోవడానికి అవకాశం ఉంది.
- తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, తోబుట్టువులు ఇలా ఎవరినైనా సరే నామినీగా నియమించుకోవచ్చు.
- కార్పొరేట్ సంస్థ, భాగస్వామ్య సంస్థ, సొసైటీ, ట్రస్ట్, హెచ్యూఎఫ్లోని వ్యక్తుల్ని నామినీగా ఎంపిక చేసేందుకు వీల్లేదు.
- గరిష్ఠంగా ముగ్గురిని నామినీలుగా ఎంచుకోవచ్చు.
- ఇలా ఎంచుకొనే సమయంలో వారిలో ఒకొక్కరికి ఎంత మొత్తంలో షేర్లు చెందాలో అనేది కూడా అందులోనే స్పష్టంగా పేర్కొనాలి.
How To Add Nominee To Demat Account :
నామినీ నమోదు ఇలా!
- ముందుగా ఎన్‌ఎస్‌డీఎల్ అధికారిక పోర్టల్ https://nsdl.co.inలోకి వెళ్లాలి.
- DP ID, Client ID, PAN నంబర్లను ఎంటర్ చేయాలి.
- తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
- దాని సాయంతో లాగిన్ అయ్యి నామినీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- చివరగా ఆధార్ ఉపయోగించి ఇ-సైన్ చేయాలి.