Cervical Cancer Vaccine: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కొత్త వ్యాక్సిన్‌ను తీసుకురాబోతున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (క్యూహెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ధర రూ. 200-400 ఉంటుందని పూనావాలా తెలిపారు.
"గర్భాశయ క్యాన్సర్ నివారణకు సంబంధించిన వ్యాక్సిన్ ఇతర టీకాల ధర కన్నా తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాం. 200 మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసే ప్రణాళిక చేస్తున్నాం. ముందుగా భారత్‌లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తాం. దేశ అవసరాల తీరాక విదేశాలకు ఎగుమతి చేస్తాం. వచ్చే ఆరు నెలల్లోపే ఒమిక్రాన్ వేరియంట్‌ను నిరోధించే వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం. భారత్‌లో బూస్టర్ డోసుగా గతంలో తీసుకున్న టీకాలే ఇస్తున్నారు. అయితే, ఒమిక్రాన్‌పై పోరాడే వ్యాక్సిన్ కోసం నోవావాక్స్‌తో కలిసి పనిచేస్తున్నాం. బూస్టర్‌గా ఈ వ్యాక్సిన్ ఎంతో మేలు చేస్తుంది.
--అదర్ పూనావాలా, సీరం సీఈఓ
మరోవైపు.. దిల్లీలో గురువారం జరిగిన వ్యాక్సిన్ లాంఛింగ్ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటు ధరలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వ్యాక్సిన్‌కు సంబంధించిన పరిశోధనలు పూర్తయ్యాయని.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఆరోగ్య రక్షణ గురించి ఆలోచించేలా చేశాయని జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.
15 నుంచి 44 సంవత్సరాల మధ్య మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌లో భారత్ రెండో స్థానంలో ఉంది. డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా.. జులైలో వ్యాక్సిన్ తయారీకి సీరం ఇన్స్టిట్యూట్కు అనుమతులు ఇచ్చింది.
ఇవీ చదవండి: అండర్ వరల్డ్ డాన్ దావూద్‌పై రూ.25 లక్షల రివార్డ్
ఐదో పెళ్లికి సిద్ధమైన 'అతడు'.. రెండో భార్య, ఏడుగురు పిల్లల ఎంట్రీతో..