CEO quits $68 billion firm: లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫండింగ్ సంస్థ 'జూపిటర్ ఫండ్ మేనేజ్‌మెంట్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆండ్రూ ఫార్మికా హఠాత్తుగా రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 1న తన పదవి నుంచి ఆండ్రూ ఫార్మికా వైదొలగనున్నట్లు సంస్థ ప్రకటనను ఉటంకిస్తూ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ఈ విషయాన్ని వెల్లడించింది. 68 బిలియన్ డాలర్ల (రూ.5 లక్షల కోట్లు) సంపద కలిగిన జుపిటర్ సంస్థ బాధ్యతలను 2019లో చేపట్టిన ఆండ్రూ ఉన్నట్లుండి సంస్థకు రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే సంస్థ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆయన మరే ఇతర సంస్థలోనూ చేరడం లేదని, కుటుంబంతో గడిపేందుకు, వ్యక్తిగతంగా బీచ్‌లో సేద తీరేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
ఆండ్రూ ఫార్మికా మూడు దశాబ్దాలుగా ఇంగ్లాండ్‌లోనే ఉన్నారు. అక్టోబర్ 1 తర్వాత స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో గడపనున్నారు. 'బీచ్‌లో కూర్చొని ఏమీ చేయకుండా కాలక్షేపం చేయాలనుకుంటున్నా' అని బ్లూమ్‌బర్గ్‌కు ఆండ్రూ తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో 27 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ఆండ్రూ ఫార్మికా వివిధ సంస్థల్లో విలువైన సేవలందించారు. అసెట్ మేనేజర్, ఈక్విటీ ఫండ్ మేనేజర్, ఈక్విటీల హెడ్‌తో పాటు పలు రకాల బాధ్యతలను నిర్వహించారు.
ఇదీ చూడండి : జీఎస్టీ మోత.. హోటల్ వసతులపై 12%.. ఆస్పత్రుల గదులపై 5%