ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) స్థానంలో డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్ (డీఈఎస్‌హెచ్-దేశ్) విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే పారిశ్రామిక వేత్తలకు పంపి, అభిప్రాయసేకరణ చేపట్టింది. ‘‘దేశ్’లో రాష్ట్రాలు భాగస్వాములయ్యేలా సెజ్‌ల చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తాం. దీనివల్ల కొత్త, పాత పారిశ్రామిక ప్రాంతాల్లోని మౌలిక వసతులను గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకుని, ఎగుమతుల్లో పోటీని పెంచొచ్చు’ అని బడ్జెట్ సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి విదితమే. అందుకనుగుణంగా సెజ్ చట్టం 2005 స్థానంలో కేంద్ర వాణిజ్యశాఖ పార్లమెంటు సమావేశాల్లో కొత్త బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇది చట్టరూపం దాలిస్తే సెజ్‌లన్నీ ఇక డెవలప్‌మెంట్ హబ్స్‌గా మారతాయి. వాటికి వివిధ చట్టాల నియంత్రణల నుంచి విముక్తి లభిస్తుంది.
ప్రస్తుతం సెజ్‌ల నుంచి ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయి. ఈ చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు తగ్గ విధంగా లేదని, ఆ సంస్థకు చెందిన వివాద పరిష్కార సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సెజ్ లోని యూనిట్లు తొలి అయిదేళ్లు 100%, తర్వాత 5 ఏళ్లు 50% ఆదాయపు పన్ను మినహాయింపును పొందుతున్నాయి. ఇలా సబ్సిడీ పొందిన దేశాల నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల, తమ మార్కెట్ ధరలపై ప్రభావం పడుతోందని చాలా దేశాలు వీటిని అనుమతించడం లేదు.
దేశ్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు దేశీయ తయారీ పెంచేందుకు, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ తయారైన వస్తువులను దేశీయంగా విక్రయించుకోడానికీ అనుమతిస్తారు. ఇందువల్ల ఇవి డబ్ల్యూటీఓ నిబంధనల పరిధిలోకి వస్తాయి.యూనిట్ల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో సింగిల్ విండో పోర్టల్ ద్వారా నిర్దిష్టకాలంలో అనుమతులు ఇస్తారు. ఇందులో ఏర్పాటైన కంపెనీలు ఎగుమతి చేయొచ్చు.. ముడిసరుకును దిగుమతి చేసుకోవచ్చు. ఇందులో తయారైన అంతిమ వస్తువు (ఫైనల్‌ప్రోడక్ట్)పై కాకుండా, వాటి తయారీ/అసెంబ్లింగ్ కోసం దిగుమతి చేసుకున్న వస్తువులు, ముడిసరుకుపై సుంకాలు చెల్లిస్తే సరిపోతుంది.
ఇదే తేడా: ప్రస్తుతం సెజ్‌లో తయారైన వస్తువులను దేశీయ మార్కెట్‌లో విక్రయిస్తే అంతిమ వస్తువుపై సుంకాలు చెల్లించాల్సి వస్తోంది. అదీ విదేశీ మారకద్రవ్య రూపంలో కట్టాల్సి వస్తుంది. దేశ్‌లో ఈ నిబంధనలు ఉండవు.
- సెజ్ చట్టం కింద అత్యధిక నిర్ణయాలు కేంద్ర వాణిజ్యశాఖ చేతుల్లో ఉన్నాయి. కొత్త బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకూ దేశ్ యూనిట్ల నిర్వహణలో తగిన భాగస్వామ్యం ఉంటుంది. తమ రాష్ట్రంలో కొత్త హబ్‌ల ఏర్పాటుకు అనుమతుల కోసం అవి నేరుగా కేంద్ర బోర్డుకు సిఫారసు చేయొచ్చు.
- నీ వీటి పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధ్వర్యంలో రాష్ట్ర మండళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దిగుమతులు, వస్తు సేకరణకు అనుమతి ఇచ్చే అధికారం వాటికి ఉంటుంది. బయటి నుంచి సేకరించిన వస్తువులు, సేవలు, గోదాముల వినియోగం, హబ్‌లలో జరుగుతున్న వాణిజ్యాన్ని ఈ బోర్డులు పర్యవేక్షించవచ్చు.
ప్రధాన లక్ష్యాలివీ:
1.అదనపు ఆర్థిక కార్యకలాపాల సృష్టి, 2.భారీగా ఉద్యోగాల కల్పన, 3.దేశ, విదేశీ మార్గాల నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడం. 4.పరిశోధన, అభివృద్ధిలో వినూత్న ఆలోచనలు, పెట్టుబడులకు పెద్దపీట వేయడం. 5.మౌలిక వసతుల కల్పన. 6.అంతర్జాతీయ సరఫరా వ్యాల్యూ ఛైన్లతో దేశీయ వస్తువులను అనుసంధానం చేయడం, మరింత పోటీ తట్టుకునేలా వస్తు తయారీ, ఎగుమతులను నిలబెట్టడం. 7.భారత సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతను కాపాడుకుంటూనే విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం కొత్త బిల్లు ప్రధాన ఉద్దేశాలని ముసాయిదాలో కేంద్రం పేర్కొంది.
కొత్త హబ్‌లు ఏర్పాటు చేయదలచుకున్న వ్యక్తులెవరైనా తమ ప్రతిపాదనలను రాష్ట్ర పరిధిలోని బోర్డులకు పంపుకోవచ్చు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర బోర్డులు సెంట్రల్ బోర్డులకు పంపుతాయి. వాటిని ఆమోదిస్తే లెటర్ ఆఫ్ అప్రూవల్ పంపుతారు. ఒకవేళ తిరస్కరిస్తే అందుకు కారణాలను వివరిస్తూ వెనక్కి పంపుతారు.
ఇవీ చూడండి