ప్రస్తుతం ఆదాయపు పన్ను విధింపునకు రెండు రకాల మార్గాలున్నాయి. కొన్ని రకాల వ్యయాలు, మదుపుపై మినహాయింపులు ఇస్తూ, ఆదాయంపై ఎక్కువ పన్నురేటు విధిస్తున్నది ఒకటి అయితే.. ఎటువంటి మినహాయింపులు లేకుండా, ఆదాయానికి తక్కువ పన్నురేటు విధించేది మరొకటి. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన 'మినహాయింపులు లేని కొత్త పన్ను విధానం'లోకి అత్యధికులను ఆకర్షించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లలో ఎక్కువ మంది కొత్త పన్ను విధానానికి మారేందుకు వీలుగా, కొన్ని మార్పుచేర్పులు చేస్తారని సమాచారం.
ఇప్పటి వరకు పన్ను చెల్లింపుదార్లు ఏ పన్ను విధానం కావాలంటే దాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. సంక్లిష్టమే అయినా పాత పన్ను విధానంలోనే ఎక్కువ మంది కొనసాగుతున్నారు. పిల్లల చదువులు పూర్తయి, ఇంటి రుణం తీరిపోయిన వారు మాత్రమే కొత్త విధానానికి మారుతున్నట్లు గుర్తించారు. అందుకే సరళంగా ఉండే కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఇందులో వార్షికాదాయం రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. ఆ తర్వాత రూ.5 లక్షల వరకు 5 శాతం, రూ.5-7.5 లక్షల వరకు 10 శాతం, రూ.7.5-10 లక్షల వరకు 15 శాతం, రూ.10-12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5-15 లక్షల వరకు రూ.25 శాతం, రూ.15 లక్షలపైన 30 శాతం పన్ను విధిస్తున్నారు.
- కార్పొరేట్ పన్ను చెల్లింపుదార్లకు కూడా 2019 సెప్టెంబరు నుంచి కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించి, మినహాయింపులు, ప్రోత్సాహకాలు తీసేసింది. 2019 అక్టోబరు 1 తర్వాత ఏర్పాటైన తయారీ కంపెనీలు, 2024 మార్చి 31లోపు కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలకు గతంలో ఉన్న 25 శాతం పన్నును 15 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఈ పన్ను విధానానికి మారిన కంపెనీలు మినహాయింపులు, ప్రోత్సాహకాలు వదులుకోవాలి.
- కార్పొరేట్ పన్నును తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తినా, ఇటీవల కార్పొరేట్ పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లను కూడా కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకునేలా దాన్ని ఆకర్షణీయంగా తీసుకొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఇవీ చదవండి: అశ్రునయనాల మధ్య బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అంత్యక్రియలు