Bharti Airtel Q4 Results: భారత్‌లో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ నాలుగో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.2,008 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.759 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2021-22 నాలుగో త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఆపరేషన్స్ నుంచి వచ్చిన ఆదాయం 22.3 శాతం పెరిగి రూ. 31,500 కోట్లకు చేరుకుంది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే సమయంలో రూ.25,747 కోట్లుగా ఉంది.
ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ. 1,16,547 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది భారతీ ఎయిర్‌టెల్ సంస్థ. గతేడాదితో పోల్చితే దాదాపు 16 శాతం వృద్ధిని సాధించింది. భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్, రాబోయే సంవత్సరాల్లో సంస్థ మరింత లాభాలు పొందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడం వల్లే ఇది సాధ్యమని అన్నారు.
31.4% పడిపోయిన ఐఓసీ నికర లాభం: పెట్రో కెమికల్స్‌లో మార్జిన్ స్క్వీజ్, ఆటో ఇంధన అమ్మకాల్లో నష్టాల కారణంగా నాలుగో త్రైమాసికంలో నికర లాభం 31.4 శాతం తగ్గిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మంగళవారం తెలిపింది. జనవరి-మార్చిలో స్టాండలోన్ నికర లాభం రూ. 6,021.88 కోట్లు ఆర్జించిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. గత త్రైమాసికంలో రూ.5,860.80 కోట్ల నికర లాభం ఉంది.
ఆర్థిక సంవత్సరం 2021-22లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ రూ.7.27 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇంతవరకు ఓ భారతీయ కార్పొరేట్ సంస్థ ఆర్జించిన అత్యధిక ఆదాయం ఇదే కావడం విశేషం. సీపీసీఎల్ వంటి అనుబంధ సంస్థల ఆదాయాలను కలుపుకున్న తర్వాత ఐఓసీ ఏకీకృత ఆదాయం రూ.7.36 లక్షల కోట్లుగా ఉంది.
ఇవీ చదవండి: స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. నిరాశే మిగిల్చిన ఎల్ఐసీ!