NPAs: ఆర్‌బీఐ, ప్రభుత్వం కలిసి తీసుకున్న పటిష్ఠ చర్యల వల్ల ప్రభుత్వం గత 8 ఆర్థిక సంవత్సరాల్లో రూ.8.6 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలయ్యాయని కేంద్రం తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో సుదీర్ఘకాలంగా నిరర్ధక ఆస్తుల కింద వర్గీకరించిన బకాయిలను వసూలు చేసేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం ఎప్పటికప్పుడు బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలోని స్థూల ఆర్థిక అంశాలు, బ్యాంకింగ్ రంగంలోని పలు సమస్యలు, ప్రపంచ వ్యాపార రంగంలోని పరిస్థితులు, ఎన్‌పీఏలను గుర్తించడంలో జాప్యం, వేగవంతమైన రుణాల మంజూరు, రిస్క్‌ను అంచనా వేయలేకపోవడం.. వంటి అంశాలు నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలని కరాడ్ తన సమాధానంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బకాయిల వసూలుకు ఇప్పటికే ఉన్న చట్టపరమైన వెసులుబాట్లతో పాటు కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు బకాయిల వసూలుకు దోహదం చేశాయని వివరించారు. ఫలితంగా గత ఎనిమిదేళ్లలో వాణిజ్య బ్యాంకులు రూ.8,60,369 కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాయని పేర్కొన్నారు.
దివాలా స్మృతి అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో రుణ వాతావరణం మారిపోయిందని కరాడ్ తెలిపారు. మార్చి 2022 నాటికి ఈ చట్టం కింద 480 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఫలితంగా బ్యాంకులు రూ.2.34 లక్షల కోట్లు రికవరీ చేశాయన్నారు. మరోవైపు రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన మొత్తాన్ని దివాలాగా ప్రకటించిన సంస్థల వివరాల ప్రతివారం నివేదించేలా ఆర్‌బీఐ తీసుకొచ్చిన సీఆర్‌ఐఎల్‌సీ వ్యవస్థ సైతం మంచి ఫలితాలిచ్చిందని తెలిపారు.
ఇవీ చదవండి: మార్కెట్లకు లాభాల పంట.. సెన్సెక్స్ 760 ప్లస్
ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..