2000 Notes Exchange Last Date Extended : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్ల ఉపసంహరణపై కీలక ప్రటకన చేసింది. బ్యాంకుల్లో రూ.2000 నోట్ల డిపాజిట్/ ఎక్స్ఛేంజ్ గడవును తాజాగా అక్టోబర్ 7 వరకు పొడిగించింది. వాస్తవానికి సెప్టెంబర్ 30తోనే ఈ గడువు ముగియాల్సి ఉంది. కానీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గడువు పొడిగింపు నిర్ణయాన్ని తీసుకుంది.
ఆ తరువాత ఇక అంతే సంగతులు
రూ.2000 నోట్లు ఇంకా ఎవరైనా కలిగి ఉంటే.. వారు వీలైనంత త్వరగా సమీప బ్యాంకుల్లో.. వాటిని డిపాజిట్ లేదా ఎక్స్ఛేంజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అక్టోబర్ 8 తరువాత బ్యాంకులు రూ.2000 నోట్లను డిపాజిట్లుగా స్వీకరించడానికి లేదా ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి అనుమతించవు.
రూ.2000 నోట్లు చెల్లుతాయి.. కానీ!
2000 Notes Legal Tender : రూ.2,000 నోట్లు అక్టోబరు 7 తర్వాత కూడా చట్టబద్ధంగా (లీగల్ టెండర్) చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది. అయితే వాటిని కేవలం ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్‌ల్లో మాత్రమే మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. అంటే అక్టోబర్ 7 తరువాత మరే ఇతర బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడంగానీ, ఎక్స్ఛేంజ్ చేయడం గానీ సాధ్యం కాదని సెంట్రల్ బ్యాంక్ తేల్చి చెప్పింది.
ఇలా మార్చుకోండి!
How To Exchange 2000 Notes In Bank : కస్టమర్లు ఆర్బీఐకు చెందిన 19 (ఇష్యూ ఆఫీస్) కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకోవడానికి వీలు ఉంటుంది. ఇందుకోసం ఇండియన్ పోస్టు ద్వారా రూ.2000 నోట్లను ఆయా ఆర్బీఐ ఆఫీసులకు పంపించాల్సి ఉంటుంది. అది కూడా ఒక్కసారికి రూ.20,000 గరిష్ఠ విలువ వరకు మాత్రమే. అంటే కస్టమర్లు ఒకసారికి కేవలం రూ.20,000 విలువ కంటే ఎక్కువ మొత్తంలో నోట్లను ఎక్స్ఛేంజ్ లేదా డిపాజిట్ చేయడానికి వీలుపడదు.
సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది!
ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ దగ్గర ఉన్న రూ.2000 నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్‌లో డిపాడిట్ చేసినప్పుడు.. అవసరమైతే ఐడెంటీటీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
ఎంత మేరకు వెనక్కి వచ్చాయంటే?
ఆర్బీఐ మే 19న రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్ఛేంజ్ చేయడం ప్రారంభించారు. ఫలితంగా సెప్టెంబర్ 1వ తేదీ నాటికి దాదాపు 93 శాతం నోట్లు ప్రజల నుంచి బ్యాంకులకు/ఆర్బీఐకు చేరాయి. ఈ మొత్తం నోట్ల విలువ రూ.3.32 లక్షల కోట్లు ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఇంకా రూ.24 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ వెల్లడించింది. వెనక్కి వచ్చిన రూ.2000 నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, 13 శాతం నోట్లు ఎక్స్ఛేంజ్ రూపంలో వచ్చినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.