స్టాక్ మార్కెట్లలో ఇటీవల రిటైల్ మదుపర్ల సంఖ్య పెరిగింది. యువతరం రిస్క్ తీసుకోవడానికి వెనుకాడడం లేదు. పైగా దీర్ఘకాల వ్యూహాలతో మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నారు. అయితే, ప్రొఫెషనల్ మదుపర్లు మార్కెట్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ లాభాల్ని గడిస్తున్నారు. కానీ, రిటైల్ మదుపర్లకు ఆ అవకాశం ఉండదు. వీరు మార్కెట్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. పైగా అధిక లాభాల్ని ఆర్జించేందుకు సరిపడా డబ్బు ఉండదు. ఇలాంటి వారి కోసమే 'సిప్ ఆన్ స్టాక్స్' (SIP in Stocks) పద్ధతి అందుబాటులో ఉంది.
'సిప్ ఆన్ స్టాక్స్' అంటే..? (what is SIP in Stocks)
సాధారణంగా 'సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-సిప్'(క్రమానుగత పెట్టుబడి పథకం) అనే విధానాన్ని మ్యూచువల్ ఫండ్లలో (SIP in mutual fund) చూస్తుంటాం. కానీ, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈ వ్యూహాన్ని అనుసరించొచ్చు. క్రమానుగతంగా కొంత మొత్తాన్ని లేదా కొన్ని స్టాక్స్‌ని కొనడమే 'సిప్ ఆన్ స్టాక్' (sip on stocks). దీర్ఘకాలంలో మదుపు చేయాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. అలాగే మార్కెట్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసే అవకాశం లేని వారికి కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. (SIP stocks meaning)
ఎలా పనిచేస్తుంది..?
ఈ విధానంలో నిర్దేశిత కాలం పాటు పెట్టుబడి పెడుతూ వెళతారు. మ్యూచువల్ ఫండ్లలో కొన్ని యూనిట్లు కొన్నట్లుగానే.. ఇక్కడ మనం చేసే క్రమానుగత పెట్టుబడి మొత్తంతో కొన్ని స్టాక్స్‌ని కొనుగోలు చేస్తారు. మన తరఫున బ్రోకరేజీ సంస్థలే షేర్లను కొంటాయి. కొన్ని కంపెనీలు అవే స్టాక్స్‌ని ఎంపిక చేస్తుండగా.. మరికొన్ని మదుపర్లకు అవకాశం ఇస్తున్నాయి. అలాగే ఒకే కంపెనీకి చెందిన షేర్లను కాకుండా పలు కంపెనీలకు చెందినవి కూడా ఒకేసారి కొనుగోలు చేయొచ్చు. బ్రోకరేజీని బట్టి సిప్ చేయాల్సిన మొత్తం రూ.100 నుంచి ప్రారంభమవుతోంది. మీరు కావాలంటే సిప్‌ని ఎప్పుడైనా ఆపేయొచ్చు. లేదా పొడిగించుకోవచ్చు. అయితే, ప్రతి ట్రేడ్‌కి బ్రోకరేజీ సంస్థలు కొంత రుసుము వసూలు చేస్తాయి.
ఇవీ ప్రయోజనాలు..
రిస్క్ తక్కువ..
సిప్ ఆన్ స్టాక్స్ విధానంలో 'రుపీ కాస్ట్ యావరేజింగ్' అనే పద్ధతిని అవలంబిస్తారు. అంటే క్రమానుగతంగా మీరు కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఆ మొత్తంతో ఆ సమయంలో ఎన్ని షేర్లు వస్తే అన్ని మాత్రమే కొంటారు. అంటే స్టాక్ ధర తక్కువ ఉంటే ఎక్కవ షేర్లు, ధర ఎక్కువ ఉంటే తక్కువ షేర్లు కొంటారు. పెట్టుబడిపై పరిమితి ఉండటంతో నష్టభయాన్ని బాగా తగ్గించుకోవచ్చు. పైగా మార్కెట్‌లోని హెచ్చుతగ్గుల నుంచి దూరంగా ఉండొచ్చు. నాణ్యమైన స్టాక్స్‌ని దీర్ఘకాలం హోల్డ్ చేయాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా వేతన జీవులకు ఇది చక్కగా సరిపోతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
క్రమశిక్షణతో.. అధిక రాబడి..
సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ సిప్ వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ప్రతినెలా మనం నిర్ణయించిన తేదీన మన ఖాతా నుంచి డబ్బులు ఆ పథకంలోకి వెళ్లిపోతాయి. ఇలా ప్రతినెలా క్రమం తప్పకుడా చేసే మదుపు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది. పైగా అదే విధంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మిగిలిన వాటితో పోలిస్తే అధిక రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది!
దీర్ఘకాల పెట్టుబడి..
దీర్ఘకాలంలో మంచి రాబడి ఆర్జించాలనుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. మార్కెట్‌పై పెద్దగా అవగాహన లేకపోయినా కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా మన పెట్టుబడి మంచి ఫలాలనిస్తుంది.
ఎవరికి సరిపోతుంది?
మ్యూచువల్ ఫండ్ల సిప్‌తో పోలిస్తే.. 'సిప్ ఆన్ స్టాక్స్'లో నష్టభయం ఎక్కువ. కాబట్టి స్టాక్ మార్కెట్‌పై లోతైన అవగాహన లేకపోయినా.. ప్రాథమిక సమాచారం తెలుసుకోవడం మాత్రం తప్పనిసరి. రోజువారీ మార్కెట్ విషయాలను అర్థం చేసుకుంటూ.. స్టాక్స్ నుంచి ఎప్పుడు బయటకు రావాలన్నది వేగంగా నిర్ణయించుకోగలిగితే మేలు! పూర్తిగా బ్రోకరేజీలపై ఆధారపడటం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ కాకపోయినప్పటికీ.. మార్కెట్లపై కనీస అవగాహన ఉన్నవారికి ఇది సరిపోతుంది. పైగా మార్కెట్లు బాగా ఊగిసలాటలో ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతి మంచి రాబడినిస్తుంది.
ఇదీ చదవండి:
- షేర్లు రాకుంటే.. డబ్బులు తిరిగిస్తారా?
- ఈ 6 సూత్రాలతో.. మీ డబ్బులకు డబ్బులు కాస్తాయి
- బంగారంలో పెట్టుబడికి సరైన పథకం ఏది ?
- గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
- పెట్టుబడులు పెట్టే ముందు ఈ 5 విషయాలు మరవొద్దు..
- యువత.. పెట్టుబడులు పెడుతున్నారా?
- వైవిధ్యమే.. పెట్టుబడులకు శ్రీరామ రక్ష!
- స్మాల్ కేస్ అంటే ఏంటి?.. పెట్టుబడులు ఎలా..?
- నెట్ లేకున్నా డిజిటల్ చెల్లింపులు.. త్వరలో దేశవ్యాప్తంగా..