స్టాక్ మార్కెట్లు (Stocks Today) సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 127 పాయింట్లు తగ్గి 58,177 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 14 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో 17,355 వద్దకు చేరింది.
'సూచీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల వద్ద ఉన్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటిస్తున్నారు. దీనికి తోడు రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం వంటి పరిణామాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది' అని నిపుణులు అంటున్నారు. జియోఫోన్ నెక్ట్స్ విడుదలను వాయిదా వేయడం వల్ల రిలయన్స్ షేర్లలపై ప్రతికూల ప్రభావం పడింది.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 58,314 పాయింట్ల అత్యధిక స్థాయి, 57,944 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,378 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,269 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ షేర్లు లాభాలను గడించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.3 శాతానికిపైగా), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎం&ఎం నష్టాల మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా) నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు లాభాలను గడించాయి. హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీ భారీగా నష్టపోయింది.
ఇదీ చదవండి: పాన్-ఆధార్ లింక్ చేయలేదా? రూ.10 వేలు ఫైన్ ఖాయం!