కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఖర్చు చేసేస్తుంటాం. అవసరం లేనివి కొనేస్తుంటాం. ఎంత నియంత్రణలో ఉందామనుకున్నా.. కుదరదు. ఇక కరోనా తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ పెరిగిపోయింది. ఖర్చుపై స్పృహే ఉండడం లేదు. ఇలా అయితే నెలవారీ ఖర్చులు పెరిగిపోయి మన ఆర్థిక ప్రణాళికపై ప్రభావం పడుతుంది. మరి అధిక ఖర్చును ఎలా నియంత్రించాలో కొన్ని మార్గాలను చూద్దాం.
ప్రీపెయిడ్ కార్డ్‌ల వినియోగం
ఖర్చు నియంత్రణకు ప్రీపెయిడ్ కార్డు ఓ చక్కని పరిష్కార మార్గం. దీన్ని ఏ బ్యాంకు ఖాతాకూ అనుసంధానించాల్సిన అవసరం లేదు. ఎంత కావాలంటే అంత ముందే ఈ కార్డులో రీఛార్జి చేసుకోవాలి. తర్వాత ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో దీన్ని వాడుకోవచ్చు. కొన్ని కార్డులు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు కూడా అనుమతిస్తాయి. ఇక క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం, ఆన్‌లైన్ షాపింగ్‌తో పోలిస్తే ఇవి కాస్త భద్రమైనవి కూడా. ఒకవేళ సైబర్ దాడికి గురైనా కార్డులో ఉన్న సొమ్ముకు మాత్రమే ప్రమాదం. కొన్ని బ్యాంకులు ప్రీపెయిడ్ కార్డు సేవల్ని అందిస్తాయి. ఒకవేళ మీకు ఖాతా లేని ఇతర బ్యాంకుల నుంచి కార్డు కావాలనుకుంటే కేవైసీ ఇస్తే సరిపోతుంది. సాధారణంగా బ్యాంకులు ఈ కార్డులకు రూ.50-100 వసూలు చేస్తుంటాయి. అలాగే కార్డులో డబ్బు లోడ్ చేసేటప్పుడు కొన్ని సంస్థలు ఛార్జీలు విధిస్తాయి. ఇక కార్డులో ఉన్న సొమ్ముకు కాలపరిమితి ఉంటుందన్న విషయాన్ని మరిచిపోవద్దు. మీ అవసరాలు, పొదుపును బట్టి ఖర్చుపై పరిమితిని విధించుకోండి. దానికి అనుగుణంగానే డబ్బు లోడ్ చేయండి. గడువులోగా దాన్ని ఖర్చు చేయండి.
ఆన్‌లైన్ వ్యాలెట్
ఇది కూడా ప్రీపెయిడ్ కార్డ్ తరహాలోనే పనిచేస్తుంది. కాకపోతే.. దీన్ని ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే వినియోగించే వెసులుబాటు ఉంటుంది. ఇక దీనిలో లోడ్ చేసుకోవాల్సిన సొమ్ము మన కేవీసీపై ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రీపెయిడ్ కార్డ్‌తో పోలిస్తే దీని వాడకం చాలా తక్కువ. అలాగే ఎక్కువ వ్యాపార సముదాయాల్లో దీన్ని ఇంకా అనుమతించడం లేదు.
కార్డ్‌లను పక్కన పెట్టేయండి
కార్డ్‌ల వినియోగం పెరిగిన తర్వాత మన ఖర్చుపై మనకు స్పృహ లేకుండా పోతోంది. ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎందుకు ఖర్చు చేశాం? అన్న విషయాల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాం. తీరా నెలాఖరుకు వచ్చే సరికి ఖాతా ఖాళీ అయినప్పుడు నాలుక కరచుకుంటున్నాం. అందుకే ఒకవేళ ఖర్చు అధికమవుతోందని మీరు భావిస్తే.. కొన్ని రోజుల పాటు కార్డ్‌ల వినియోగాన్ని పూర్తిగా పక్కనబెట్టేయండి. నగదు మాత్రమే ఉపయోగించండి. అప్పుడు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ ఖర్చు చేస్తున్నారన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది.
ఖాతాలు ఖాళీ చేయండి
కార్డ్‌లను పక్కన పెట్టడం కొంచెం కష్టమనుకుంటే ఈ పద్ధతిని అనుసరించడం మేలు. వేతనం రాగానే మీ ఖాతాలోని డబ్బుని ఇతర ఖాతాలోకి బదిలీ చేయండి. తరచూ వినియోగించే ఖాతాలో మీ అవసరాల మేరకే డబ్బు ఉంచండి. అంతే ఖర్చు చేయాలని నిశ్చయించుకోండి. అలా చేస్తే మీ ఖాతా ఖాళీ అయ్యే వరకు మాత్రమే మీరు ఖర్చు చేయగలరు. తరచూ ఖాతాలోని డబ్బును చెక్ చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు ఖర్చు చేయడానికి ఇంకా ఎంత డబ్బు ఉందో మీ స్పృహలోకి వస్తూ ఉంటుంది. అయితే, ఈ పద్ధతిలో షరతులు వర్తిస్తాయన్న విషయం మరచిపోవద్దు. బ్యాంకుల్లో 'మినిమం బ్యాలెన్స్' అనే నిబంధన ఒకటి ఉందిగా. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
విందు, వినోదాలను తగ్గించండి
ఖర్చు ఎక్కువై భవిష్యత్తు ఆర్థిక స్థితిపై ప్రభావం పడుతుందనుకుంటే.. మీ విందు, వినోద కార్యక్రమాల్ని తగ్గించాల్సిందే. కొంతకాలం పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్న కాలక్షేపాన్ని ఎంచుకోండి. దూర ప్రయాణాలు, విహార యాత్రల వంటిని మానుకొని దగ్గర్లోని సర్కస్‌కు, పార్క్‌కు, సినిమాకు వెళ్లడం వంటివి చేయండి. పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించండి.
ఇదీ చదవండి:సర్కారీ ఉపసంహరణ సరైనదేనా?