ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెండు నెలలు దేశమంతా పూర్తి లాక్డౌన్లో ఉండిపోయింది. దీని ప్రభావంతో ఈ సమయంలో దేశ వృద్ధి రేటు 25-40 శాతం క్షీణిస్తుందని అంచనా. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఆర్థిక పునరుద్ధరణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అన్‌లాక్ 1.0 ప్రారంభించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా ఉపాధి కల్పించే రంగాలను గుర్తించి వాటిపై దృష్టి సారిస్తే.. ఆర్థిక పునరుద్ధరణ సాధ్యమవుతుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ ఎన్.ఆర్.భానుమూర్తి. ముఖ్యంగా అలాంటి రంగాల్లోకి ఎక్కువ నగదును చొప్పించడం ద్వారా ఆ ప్రభావం ఇతర రంగాలపైనా సానుకూలంగా ఉంటుందని 'ఈటీవీ భారత్'తో చెప్పారు.
వీటిపై దృష్టి సారించాలి..
దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చాలా రంగాలు.. లాక్‌డౌన్‌కు ముందు కూడా గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయన్నారు భానుమూర్తి. గనుల తవ్వకాలు, తయారీ, విద్యుత్, నిర్మాణ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అయితే కరోనా విజృంభణ తర్వాత ఈ పరిస్థితులు మరింత దిగజారినట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో గడిచిన మూడేళ్ల నుంచి గడ్డు పరిస్థితులు నడుస్తున్నట్లు తెలిపారు.
కరోనా లాక్డౌన్ ముందు దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల్లో 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు నిలిచిపోయి ఈ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి కల్పనకు ఉన్న సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్లతో పూచీలేని రుణాల పథకాన్ని ప్రకటించారు.
ఇంకా కావాలి..
అయితే ఎంఎస్ఎంఈలకు ఈ సహాయం మాత్రమే సరిపోదని ప్రొఫెసర్ భానుమూర్తి అభిప్రాయపడ్డారు. సామాన్యుడి చేతిలో నగదు నిల్వ ఉండి కొనుగోలు శక్తి పెంచేలా డిమాండ్ వైపు ఉద్దీనలు ఉండాలని.. ఇందుకోసం పన్నులు తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేయాలని సూచించారు.
సరఫరా వ్యవస్థకు ఊతమందించేందుకు.. కంపెనీలు ఉత్పత్తి పెంచేలా కార్పొరేట్ సుంకాలు, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని సూచించారు భానుమూర్తి. వీటి ద్వారా ఉపాధితో పాటు.. కొనుగోలు సామర్థ్యం కూడా పెరుగుతుందని విశ్లేషించారు.
ఆర్థిక వృద్ధికి 'ఆత్మ నిర్భర్ భారత్' ఊతమిస్తుందా?
ప్రభుత్వం మధ్య, ధీర్ఘకాలంలో సరఫరా వ్యవస్థపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారించినట్లు 'ఆత్మ నిర్భర్ భారత్' పథకాన్ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ భానుమూర్తి. ఈ పథకం ద్వారా డిమాండ్‌పై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదని అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే ద్రవ్యలోటు పెరుగుతుందని తెలిసినా.. చాలా మంది భారీ ప్యాకేజీ కోరుతున్నారని భానుమూర్తి విశ్లేషించారు.
ఇలాంటి విధానాల ద్వారా ద్రవ్యలోటు అంచనాలు దాటినప్పటికి.. జీడీపీ వృద్ధి రేటు, ఉద్యోగ కల్పన కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన ముందు ఉన్న ఉత్తమ మార్గం ఇదొక్కటేనని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రో ధరలు