ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా భారీ నష్టం కలిగిస్తుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ ఏడాది సుమారు 2 ట్రిలియన్ అమెరికా డాలర్లు (రూ.148 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది.
ప్రపంచ వృద్ధి రేటు కూడా 2.5 శాతానికి దిగువకు పడిపోతుందని అభిప్రాయపడింది ఐరాస వాణిజ్యం, అభివృద్ధి ఏజెన్సీ. ఫలితంగా పలు దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోతాయని తెలిపింది.
"కరోనా విజృంభణతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సెప్టెంబర్ అంచనాలు తప్పనున్నాయి. 2 శాతానికి దిగువన ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ఫలితంగా ఇది 74 లక్షల కోట్ల నుంచి 148 లక్షల వరకు నష్టాన్ని కలిగించవచ్చు."
- రిచర్డ్ కొజుల్, ఐరాస ఆర్థిక వేత్త
ఈ పరిణామంలో ముఖ్యంగా చమురు ఎగుమతి ఆధారిత దేశాలు భారీగా నష్టపోనున్నాయని ఐరాస తెలిపింది.
4 వేలు దాటిన మృతులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైరస్ కేంద్రబిందువైన చైనాలో తాజాగా 17 మంది చనిపోయారు. ఇటలీలో 463 మంది ప్రాణాలు కోల్పోగా.. జర్మనీలో ఇద్దరు కన్నుమూశారు. కెనడాలోనూ తొలి కొవిడ్-19 మరణం నమోదైంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మృతుల సంఖ్య 4,011కు చేరింది.
ఇదీ చూడండి: ట్రంప్‌కు కరోనా ముప్పు... త్వరలో పరీక్షలు?