ఈ ఏడాది నవరాత్రుల సమయంలో కార్ల తయారీ సంస్థల పంట పండింది. దేశంలో ప్రధాన కార్ల తయారీ సంస్థలైన మారుతీ సుజుకీ, హ్యూందాయ్, టాటా మోటార్స్ రిటైల్ అమ్మకాలు గత ఏదాది ఇదే సమయంతో పోలిస్తే భారీగా పెరిగాయి.
కియా మోటార్స్, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, మహీంద్రా&మహీంద్రా, హోండా కార్స్ ఇండియా.. విక్రయాలూ దసరాతో కలిపి 10 రోజుల్లో భారీగా పెరిగినట్లు ప్రకటించాయి.
నవరాత్రుల్లో కొత్త వస్తువులు, ఆస్తుల కొనుగోలును శుభపరిణామంగా పరిగణించే సెంటిమెంట్ విక్రయాల వృద్ధికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
నవరాత్రి విక్రయాలు ఇలా..
- ఈ ఏడాది నవరాత్రి సేల్స్‌లో 96,700 యూనిట్లు విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో మారుతీ సుజుకీ 76,600 యూనిట్లు అమ్మడం గమార్హం.
- హ్యూందాయ్ కార్ల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 28 శాతం పెరిగి 26,068 యూనిట్లుగా నమోదయ్యాయి.
- రిటైల్ విక్రయాలు గత ఏడాది నవరాత్రి సమయంతో పోలిస్తే ఏకంగా 90 శాతం పెరిగి.. 10,887 యూనిట్లుగా నమోదయ్యాయని టాటా మోటార్స్ తెలిపింది.
- నవరాత్రి సమయంలో కియా మోటార్స్ రిటైల్ విక్రయాలు 2019తో పోలిస్తే అత్యధికంగా 224 శాతం పెరిగాయి. మొత్తం 11,640 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- టొయోటా కిర్లోస్కర్ 5 వేల యూనిట్లు విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇవి 13 శాతం అధికం.
- మహీంద్రా&మహీంద్రా ఎస్‌యూవీల బుకింగ్స్ గత ఏడాదితో పోలిస్తే 41 శాతం పుంజుకున్నాయి.
- హోండా కార్స్ ఇండియా విక్రయాలు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 10 శాతం పెరిగాయి.
ఇదీ చూడండి:ఎన్నికలు, మళ్లీ లాక్డౌన్ అంశాలే మార్కెట్లకు కీలకం!