టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు 'జెంషెట్ జీ టాటా'.. ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వవేత్త అని ఓ నివేదిక పేర్కొంది. గడిచిన శతాబ్దానికి సంబంధించిన విరాళాలపై.. హరూన్, ఎడెల్గేవ్ ఫౌండేషన్లు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయం తెలిసింది.
గడిచిన శతాబ్ద కాలంలో దివంగత జెంషెట్ జీ టాటా దాతృత్వం విలువ 102 బిలియన్ డాలర్లుగా పేర్కొంది నివేదిక. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జెంషెట్జీ టాటా అగ్రస్థానంలో ఉండటం విశేషం.
తర్వాతి స్థానాల్లో ఉన్నది వీరే..
- మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్, ఆయన నుంచి విడాకులు తీసుకోనున్న సతీమణి మెలిందా కలిపి 74.6 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. దీనితో వీరు ప్రపంచంలోనే అత్యధిక విరాళాలు ఇచ్చిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ 37.4 బిలియన్ డాలర్ల వితరణతో మూడో స్థానంలో నిలిచారు.
- జార్జ్ సోరస్ 34.8 బిలియన్ డాలర్లు, జాన్ డీ రాక్ఫెల్లర్ 26,8 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చి వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు.
- ఈ జాబీతాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ మాత్రమే కావడం గమనార్హం. ప్రేమ్జీ 22 బిలియన్ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక పేర్కొంది.
- అల్ఫ్రెడ్ నోబెల్ వంటి ప్రముఖులు కూడా టాప్ 50లో లేకపోవడం గమనార్హం.
- ఈ జాబితాలో ఉన్న వారిలో 38 మంది అమెరికాకు చెందిన వారేనని నివేదిక పేర్కొంది. యూకేకు చెందిన వారు 5 మంది, ముగ్గురు చైనీయులు ఇందులో ఉన్నట్లు తెలిపింది.
- మొత్తం టాప్ 50 మంది కలిసి గత శతాబ్దంలో 832 బిలియన్ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక వివరించింది. తమ ఫౌండేషన్ల ద్వారా, విరాళాల రూపంలో ఈ మొత్తం ఇచ్చినట్లు వెల్లడించింది.
- ఈ టాప్-50 జాబితాలో 37 మంది ఇప్పటికే మరణించగా.. 13 మంది మాత్రమే జీవించి ఉన్నారు.
ఇవీ చదవండి: