భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సమయంలో దేశీయ సంస్థలు రిస్క్ తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశం 2021లో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా సంక్షోభం ఉన్నా.. తమ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాలను బలవంతంగా తీసుకోలేదని.. దృఢ సంకల్పంతోనే తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారీగా తరలి వస్తున్నట్లు మోదీ వివరించారు.
కంపెనీ స్వదేశానిది కాకపోయినా.. వాటి ఉత్పత్తులు మాత్రం భారత్‌లోనే తయారు కావాలనేదే తమ లక్ష్యమన్నారు మోదీ. దేశంలో ప్రస్తుతం 60 యూనికార్న్ (బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీ) అంకుర సంస్థలు ఉన్నాయని.. అందులో 21 కంపెనీలు గడిచిన కొన్ని నెలల్లోనే ఆ మార్క్‌ను అందుకున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: 2020-21 వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్ఓ క్లారిటీ!