ముట్టుకుంటే అంటుకునే కరోనా వైరస్ మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏటీఎంను తాకకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే విధానాన్ని అభివృద్ధి చేసింది ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది. ఈ పద్ధతితో ఏటీఎం పిన్ను కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ టెక్నాలజీ గురించి బ్యాంకులకు డెమో ఇస్తున్నట్లు చెప్పారు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఛైర్మన్, ఎండీ రవి గోయల్. ఈ సాంకేతికత కోసం బ్యాంకులు అదనంగా వెచ్చించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటే సరిపోతుందన్నారు.
ఈ విధానంలో క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలంటే వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లో తమ బ్యాంకుకు సంబంధించిన యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి.
విత్‌డ్రా చేసుకునే విధానం...
- స్మార్ట్ ఫోన్లో మీ బ్యాంకు యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ విత్‌డ్రాయల్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఎంత నగదు కావాలో ఫోన్లోనే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏటీఎంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
- ఎమౌంట్‌ను కన్ఫర్మ్ చేస్తూ యాప్‌లో ప్రోసీడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. యాప్‌లో ఉపయోగించే ఎం-పిన్ను ఎంటర్ చేసి లావాదావీ పూర్తి చేయాలి. ఏటీఎం నుంచి నగదు, రసీదు తీసుకోవాలి.
వినియోగదారులకు క్యాష్ విత్‌డ్రా సదుపాయాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏజీఎస్ తెలిపింది. కార్డ్‌లెస్ విధానంతో భద్రతతో పాటు ఏటీఎం కార్డులతో జరిగే మోసాలకు అడ్డుకట్టపడుతుందని పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 72వేల ఏటీఎం యంత్రాలను నిర్వహిస్తోంది ఏజీఎస్. ప్రముఖ బ్యాంకులకు అవసరమైన సాంకేతిక సేవలను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఇప్పటికే యూపీఐ-క్యూఆర్ ఆధారిత క్యాష్ విత్‌డ్రా విధానాన్ని ప్రవేశపెట్టింది.