వంట నూనె అవసరాలకు విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తీసుకొచ్చిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్ పామ్ (ఎన్ఎంఈఓ-ఓపీ) పథకానికి.. రూ.11,040 నిధులను కేటాయించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు.
వచ్చే ఐదేళ్లకు గానూ దేశీయంగా పామాయిల్ సాగును ప్రోత్సహించడం, వంట నూనె అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం ఈ నిధులను వినియోగించనుంది కేంద్రం. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగు కోసం హెక్టార్‌కు రూ.29 వేలు(ప్రస్తుతం ఇది రూ.12వేలుగా ఉంది) పెట్టుబడి సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈశాన్య భారతంలో 15 హెక్టార్లలో సాగుకు రూ.కోటి వరకు సాయం అందించాలని తీర్మానించింది.
పథకం లక్ష్యాలు..
ఈ మిషన్ ద్వారా 2025-26 నాటికి 6.5 లక్షల హెక్టార్లలో పామాయిల్ పంటను పండించేలా రైతులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఫలితంగా వార్షిక ప్రాతిపదికన 2025-26 నాటికి 11.20 లక్షల టన్నుల ముడి పామాయిల్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇది 2029-30 నాటికి 28 లక్షల టన్నులకు పెరుగుతుందని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.70 లక్షల హెక్టార్లలో మాత్రమే పామాయిల్ సాగు అవుతున్నట్లు వెల్లడించారు తోమర్. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగుకు అవకాశాలు మెండుగా ఉన్నా.. శుద్ధి పరిశ్రమలు లేకపోవడం వల్ల అది సాధ్యపడటం లేదని వివరించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్ఎంఈఓ-ఓపీ పథకం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర- ఎంతంటే?