ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఆల్కహాల్ హోండెలివరీ ప్రారంభించినట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లోనూ మద్యాన్ని ఇళ్లకే సరఫరా చేయడానికి ప్రభుత్వాల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్‌లోని ఇతర పెద్ద నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు స్విగ్గీ స్పష్టం చేసింది. డెలివరీ చేసే ముందు వినియోగదారుల వయసు నిర్ధరించుకుంటున్నట్లు పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం లైసెన్సులు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాతే రిటైల్ వ్యాపారులతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటున్నట్లు స్విగ్గీ స్పష్టం చేసింది. స్విగ్గీ యాప్‌లో 'వైన్ షాప్స్' కేటగిరీలో మద్యానికి సంబంధించిన వివరాలు ఉంటాయని తెలిపింది.
"ఆల్కహాల్‌ను హోండెలివరీ చేయడం ప్రారంభించిన తర్వాత రిటైల్ ఔట్లెట్లకు అదనపు వ్యాపార ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్కువ మంది దుకాణాల ముందు గుమిగూడకుండా చేయవచ్చు. తద్వారా వ్యక్తిగత దూరం పాటించవచ్చు."
-అనుజ్ రాఠీ, స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్
ప్రస్తుతం స్విగ్గీకి ఉన్న విస్తృత నెట్వర్క్, సాంకేతికత, మౌలిక సదుపాయాలను ఉపయోగించి నిత్యావసర సరకులు డెలివరీ చేయడం సహా కొవిడ్ ఉపశమన చర్యల కోసం స్థానిక అధికారులకు సహకరిస్తున్నట్లు అనుజ్ తెలిపారు.