స్టాక్ మార్కెట్లు వారంలో రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లు తగ్గి 37,734 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11,154 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, దేశీయంగా ఆర్థిక వృద్ధిపై నెలకొన్న భయాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది. వీటికి తోడు సెప్టెంబర్ డెరివేటివ్స్ గడువు ముగింపు దగ్గర పడుతున్న నేపథ్యంలో మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా...
సెన్సెక్స్ 38,210 పాయింట్ల అత్యధిక స్థాయి, 37,531 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,302 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,084 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి.
మారుతీ సుజుకీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్&టీ, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలూ మంగళవారం నష్టపోయాయి.