రవాణా రంగం పర్యవరణ హితంగా మారేందుకు పెట్టుబడులు పెడితే.. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చని ఓ నివేదిక తెలిపింది. అలాగే దేశాలు కాలుష్యరహితంగా, పచ్చగా, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థలుగా రూపొందడానికి దోహదపడుతుందని వెళ్లడించింది.
కోటి ఉద్యోగాలు..
అంతర్జాతీయ కార్మిక సంస్థ, (యారోప్) ఐరాస ఆర్థిక కమిషన్ రూపొందించిన ఈ నివేదిక ... రవాణా, వాహనరంగాల్లో సమూల మార్పుల కోసం పెట్టే ఈ పెట్టుబడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి ఉద్యోగాలు సృష్టించవచ్చని పేర్కొంది.
రవాణా రంగంలో 50 శాతం వరకు విద్యుత్ వాహనాలు తయారు చేస్తే... యూఎన్ఈసీఈ ప్రాంతంలో మరో 29 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని నివేదిక తెలిపింది. ఇవే దేశాలు ప్రజారవాణాలో పెట్టుబడులు పెడితే 25 లక్షల ఉద్యోగాలు... అదే పెట్టుబడులను రెట్టింపు చేస్తే 50 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమని పేర్కొంది.
వాహన రంగానికి తోడు.. వస్తు, సేవలపై పెట్టుబడులు పెంచడం, చమురు ఖర్చులు తగ్గించడం కూడా ఉద్యోగాల కల్పనకు సహకరిస్తుందని నివేదిక తెలిపింది. ప్రైవేటు వాహనాలు, సరకు రవాణా వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపొందించడం వల్ల మరిన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాలుష్యం నివారణ
"రవాణా రంగంలో ఇలాంటి మంచి మార్పుల వల్ల కర్బన ఉద్గారాలు నివారించవచ్చు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్య స్థాయిలు పడిపోతాయి. ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయని" నివేదిక స్పష్టం చేసింది.
సమగ్ర విధానం కావాలి..
వాహన, రవాణా రంగాల్లో వచ్చే సమూల మార్పులే ఉపాధి అవకాశాలను పెంచడానికి దోహదపడతాయని నివేదిక స్పష్టం చేసింది. అందువల్ల దీని కోసం సమగ్ర విధానాలు రూపొందించి, అమలు చేయాలని సిఫార్సు చేసింది. నైపుణ్యాల అభివృద్ధి, సామాజిక భద్రత, లేబర్ మార్కెట్ విధానాలు అత్యవసరమని తేల్చి చెప్పింది.
ఇదీ చూడండి: హాంకాంగ్ హక్కులను హరించేలా చైనా కొత్త బిల్లు