ప్రముఖ మెసేజింగ్ సేవల యాప్ వాట్సాప్.. మరోసారి డేటా ప్రైవసీ వివాదంలో (WhatsApp data privacy Issue) చిక్కుకుంది. యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ ఫేస్బుక్ సహా గ్రూప్‌లోని ఇతర సంస్థలతో పంచుకునే విషయమై ఐరోపా సమాఖ్య (ఈయూ) నిబంధనలను ఉల్లఘించినట్లు ఐర్లాండ్ నిఘా సంస్థ (Irish watchdog) ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే నిబంధనల అతిక్రమించిందనే కారణంతో 225 మిలియన్ యూరోలు ( దాదాపు రూ.2 వేల కోట్లు) జరిమానా (Fine to WhatsApp) విధించింది.
అదే విధంగా.. వాట్సాప్ ఈ విషయంపై వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఐరిష్ నిఘా సంస్థ. ఐరోపా సమాఖ్య (ఈయూ) నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు ఉండాలని స్పష్టం చేసింది.
ఇదే అతిపెద్ద జరిమానా..
జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్)ను ఈయూ అమలులోకి తెచ్చిన తర్వాత.. 2018లో వాట్సాప్‌పై దర్యాప్తు ప్రారంభించింది ఐరిష్ నిఘా సంస్థ. ఇటీవలే దర్యాప్తును ముగించి.. ఈ జరిమానా విధించింది. ఐరిష్ నిఘా సంస్థ విధించిన అతిపెద్ద జరిమానా ఇదే కావడం గమనార్హం. గత ఏడాది ట్విట్టర్‌కు కూడా ఇలాంటి కారణాలతోనే.. 4.5 లక్షల యూరోల జరిమానా వేసింది.
జీడీపీఆర్ నిబంధనలు పాటించలేదనే కారణంతో.. అమెజాన్‌పై ఈ ఏడాది జులైలో లగ్జెంబర్గ్ నిఘా సంస్థ ఏకంగా 746 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
వాట్సాప్ అసంతృప్తి..
జరిమానా విషయంపై వాట్సాప్ స్పందించింది. యుజర్లకు సురక్షితమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లోనూ దీనిని కొనసాగిస్తామని.. వివరించింది. అయితే నిఘా సంస్థ చేస్తున్న ఆరోపణలకు, విధించిన జరిమానాకు పొంతన లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక! మోడ్ యాప్ వాడితే అంతే..