భారత్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. యాజమాన్యాలు జీతాలు చెల్లించే పరిస్థితి లేకపోవడం వల్ల ఈపీఎఫ్ నుంచి కొంత నగదును తీసుకుంటున్నారు. కొవిడ్-19 కారణంగా సవరించిన నిబంధనల ప్రకారం రూ.2,700 కోట్లను ఖాతాదారులు ఉపసంహరించారని ఈపీఎఫ్‌వో ద్వారా తెలిసింది.
ఈపీఎఫ్‌వో నుంచే కాకుండా సంస్థలు నిర్వహిస్తున్న పీఎఫ్ ట్రస్టుల్లోనూ ఉద్యోగులు అవసరమైన మేరకు డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల వారే కాకుండా బ్లూచిప్ కంపెనీల ఉద్యోగులూ క్లెయిమ్ చేస్తున్నారని తెలిపారు.
సంస్థలు నిర్వహిస్తున్న పీఎఫ్ ట్రస్టుల్లో రూ.500 కోట్ల వరకు ఉపసంహరించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కడలూరులోని నెవెలి లిగ్నైట్ కార్పొరేషన్ ఉద్యోగులు రూ.84.4 కోట్లు, విశాఖ ఉక్కు ఉద్యోగులు రూ.40.9 కోట్లు, ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఉద్యోగులు రూ.28 కోట్లు తీసుకున్నారని సమాచారం.
లాక్‌డౌన్‌లో ప్రజలు ఆదాయం కోల్పోవడం వల్ల రాబోయే పది రోజుల్లో ఉపసంహరించుకొనే వారి సంఖ్య పది లక్షలకు చేరుతుందని విశ్లేషకులు అంటున్నారు. నిర్మాణం, రవాణా, లాజిస్టిక్స్, ఐటీ, తయారీ సహా అనేక రంగాల్లో వ్యాపారాలకు ఆర్జన లేదు. దీంతో ఈ రంగాల్లోని ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు తీసుకొనే అవకాశం ఉంది.