Chitra Ramkrishna: ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈఓ, ఎండీ చిత్రారామకృష్ణకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించిన వ్యక్తి ఆమె శిరోజాలపైనా ఆసక్తి చూపారు. జడను కనుక వేర్వేరు రకాలుగా వేస్తే ఇంకా బాగుంటావనీ ఆమెకు సూచించారు. ఆమెతో కొన్ని పాటలు పంచుకున్నారు. ఇద్దరూ కలిసి తూర్పు ఆఫ్రికాలోని దీవి అయిన సీషెల్స్‌కు వెళ్లారనీ సెబీ వెల్లడించింది. తమకు చిత్రా రామకృష్ణ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు పూర్తి విరుద్ధంగా ఇవి ఉన్నాయని సెబీ పేర్కొంది. తన ఆధ్యాత్మిక గురు ఒక 'సిద్ధ పురుషుడు' లేదా 'పరమహంస' అని.. ఎటువంటి భౌతిక రూపం లేదని.. ఆయన కోరిన రూపాన్ని ధరించగలరని చిత్రా రామకృష్ణ సెబీకి తెలిపారు. ఆయన హిమాలయా పర్వతాల్లో ఉంటారని.. గత 20 ఏళ్లుగా ఆయన తన వ్యక్తిగత, వృత్తిగత అంశాల్లో మార్గనిర్దేశం చేశారని ఆమె సెబీకి వివరించారు. అయితే సెబీ శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో అందుకు భిన్నంగా ఉన్న అంశాలన్నీ పొందుపరిచారు.
ఆనంద్ సుబ్రమణియన్‌ను ఎన్‌ఎస్‌ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించడం; తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసరుగా, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనా పరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సెబీ ఈ వివరాలు తెలిపింది.
ఇ-మెయిళ్లు నడిచాయ్..: 'గుర్తుతెలియని వ్యక్తి' చిత్రా రామకృష్ణకు మధ్య జరిగిన ఇ-మెయిళ్ల ప్రకారం.. 2015లో ఆ వ్యక్తి, చిత్రా రామకృష్ణ పలుమార్లు కలుసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలపడానికి ఆమె నిరాకరించారని.. ఆ వ్యక్తి ఒక ఆధ్యాత్మిక శక్తి అని మాత్రమే తెలిపారని సెబీ వివరించింది. ప్రతి మెయిల్ వివరాలనూ వెల్లడించలేం కానీ.. ఆ వ్యక్తి ఒక మనిషేనని, చిత్రా రామకృష్ణతో కలిసి పలు ప్రాంతాలకు 'చిల్' కావడానికి వెళ్లారని సెబీ తెలిపింది. 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబరు వరకు ఎన్‌ఎస్‌ఈఓ ఎండీ, సీఈఓగా చిత్రా రామకృష్ణ పనిచేశారు. హిమాలయ యోగిని 'శిరోన్మణి'గా ఆమె అభివర్ణించారు. 2018 ఏప్రిల్‌లో సెబీకి ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం.. దిల్లీలోని స్వామిమలై ఆలయంలో 'గుర్తుతెలియని వ్యక్తి'ని ఆమె కలిశారు. పలు పవిత్ర స్థలాల్లోనూ పలుమార్లు కలుసుకున్నారు.
'బ్యాగులు సర్దుకో.. సీషెల్స్‌కు వెళదాం': 2015 ఫిబ్రవరి 18న చిత్రారామకృష్ణకు ఆ వ్యక్తి పంపిన ఇ-మెయిల్‌లో 'ఇవాళ నీవు చాలా బాగున్నావు. నీ శిరోజాలుగా వివిధ రకాలుగా అలంకరించుకోవడం నేర్చుకోవాలి. అపుడు మరింత చూడముచ్చటగా ఉంటావు. ఉచిత సలహానే అయినా, దీన్ని నువ్వు స్వీకరిస్తావని తెలుసు. మార్చి మధ్యలో కాస్త విరామం ఉండేలా చూసుకో' అని ఉంది. అంతకు ముందు రోజు ఇమెయిల్‌లో 'నీ బ్యాగులు సిద్ధం చేసుకో. వచ్చే నెల సీషెల్స్‌కు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తున్నా. నీకు వీలుంటే నాతో రావొచ్చు. ఇదంతా కాంచన, భార్గవలతో కంచన్(సుబ్రమణియన్) లండన్‌కు వెళ్లే ముందు; నువ్వు న్యూజిలాండ్‌కు వెళ్లే ముందు జరుగుతుంది. మనం వెళ్లేదారిలో హాంకాంగ్ లేదా సింగపూర్‌లో ఆగొచ్చు. నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు. శేషు అవన్నీ చూసుకుంటారు. నీకు ఈత తెలిస్తే సముద్ర స్నానం చేయొచ్చు. టికెట్ల కోసం కంచన్‌తో మాట్లాడమని నా టూర్ ఆపరేటరుకు చెప్పా' అని ఉంది.
సంతోషంగా ఉంది: 2015 సెప్టెంబరు 16 నాటి ఇ-మెయిల్‌లో అయితే 'నేను పంపిన మకర కుండల పాట విన్నావా? వాటిని కచ్చితంగా వినాలి. నీ మది నుంచి నీ మోముపైకి వచ్చే చిరునవ్వును చూస్తున్నపుడు నాకు ఆనందంగా ఉంటుంది. నిన్న సమయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు చేసే ఈ చిన్నచిన్న విషయాలు నిన్ను శక్తిమంతంగా, తక్కువ వయస్సు అనిపించేలా చేస్తుంది.' అని రాసి ఉంది.
ఇవీ చూడండి: 5జీ దిశగా అడుగులు.. మే నెలలో వేలం షురూ..!