ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రణాళికను (Google Extended Work form Home) మరోసారి వాయిదా వేసింది గూగుల్. ఆఫీసుకు తిరిగి వచ్చే ముందే ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకా వేసుకుని ఉండాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి వరకు మెజారిటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఎత్తివేసే యోచన లేదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాతే స్థానిక పరిస్థితులను బట్టి దేశాల వారీగా వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ఇంటి నుంచి పని చేసే విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ఆఫీసుల రీ ఓపెనింగ్ ప్రణాళికను గూగుల్ వాయిదా వేయడం వరుసగా ఇది రెండో సారి. ఇంతకు ముందు జులైలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని (కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో) పూర్తిగా తెరవాలని భావించింది. అయితే ఉద్యోగులంతా పూర్తిగా వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి అనే నిబంధన కారణంగా ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది.
డెల్టా భయాలు..
వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనలతో పాటు.. కరోనా డెల్టా వేరియంట్ భయాలు (COVID Delta variant) కూడా టెక్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంను పొడిగించేందుకు కారణం. డెల్టా వేరియంట్ వల్ల.. కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. చాలా సంస్థలు ఆఫీసులను రీ ఒపెన్ చేసే విషయంలో పునరాలోచనలో పడ్డాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇది వరకే వర్క్ ఫ్రం హోంను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరిన్ని దిగ్గజ సంస్థలు కూడా అదే ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు- ఏ నగరంలో ఎంతంటే..