డిజిటల్ చెల్లింపులు అనివార్యం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనుకోకుండానే మోసపూరిత అప్లికేషన్లు(Cyber Attacks) మన స్మార్ట్ ఫోన్లలో చేరిపోతున్నాయి. వాటి బారిన పడి మోసపోకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తప్పవు.
- ఆర్థిక అంశాలతో ముడిపడిన యాప్‌లను వాడేందుకు మీకు సంబంధించిన సమాచారం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా మోసపూరిత యాప్‌ను మీరు వాడేందుకు ప్రయత్నించినప్పుడు ఈ రహస్య సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలో పడే అవకాశం ఉంది. అందుకే, మీరు డౌన్‌లోడ్ చేసుకుంటున్న యాప్‌ల గురించి పూర్తిగా తెలుసుకోండి.
- మీ ఆదాయ వ్యయాలను గమనిస్తూ.. బడ్జెట్‌ను సిద్ధం చేసే యాప్‌లు ఎన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు మీ బ్యాంకు, డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలను గమనిస్తూ.. మీకు రోజువారీ, నెలవారీ నివేదికలు ఇస్తుంటాయి. ఇందులో కొన్ని నమ్మదగిన యాప్‌లు ఉన్నాయి. అయితే, కొన్ని యాప్‌లు కేవలం మీ ఆర్థిక అలవాట్లను తెలుసుకునేందుకు, ఆ సమాచారాన్ని ఇతరులతో పంచుకునేందుకే ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్‌లో చేరనీయకండి.
- కేవైసీ సమాచారం కోసం బ్యాంకులు ఎప్పుడూ ఫోన్లు చేసి వివరాలు అడగవు. ఇలా ఎవరైనా అడుగుతున్నారంటే అది కచ్చితంగా మోసం చేసే ఆలోచనేనని మర్చిపోవద్దు.
- ప్రతి బ్యాంకూ ఇప్పుడు సొంతంగా యాప్‌లను అందిస్తోంది. ఇందులో అన్ని రకాల సేవలనూ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మీ ఖాతా ఉన్న బ్యాంకు యాప్‌లను వాడటం ఎప్పుడూ సురక్షితం.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన విమాన ఛార్జీలు- కొత్త ధరలు ఇలా...