Brent oil: బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం ఉదయం ఒకదశలో 99.38 డాలర్లకు చేరినా, తదుపరి కాస్త ఉపశమించి 97 డాలర్ల వద్ద కదలాడింది. 2014 సెప్టెంబరులో 99 డాలర్ల పైకి చేరిన బ్యారెల్ ముడిచమురు, మళ్లీ ఆ స్థాయికి చేరడం ఇప్పుడే. ఐరోపా సహజ వాయువులో మూడో వంతు; అంతర్జాతీయ చమురు ఉత్పత్తిలో 10 శాతం వాటా రష్యాకు ఉంది. రష్యా గ్యాస్.. ఉక్రెయిన్ మీదుగా వేసిన గొట్టాల ద్వారానే ఐరోపాకు సరఫరా అవుతుంది. రష్యా నుంచి మన దేశానికి వచ్చే చమురు సరఫరా చాలా తక్కువ. 2021లో రోజుకు 43,400 బారెళ్ల మేర చమురును దిగుమతి చేసుకున్నాం. ఇది మొత్తం దిగుమతుల్లో 1 శాతమే. బొగ్గు కూడా 1.3 శాతం(1.8 మి. టన్నుల) మేర మాత్రమే ఆ దేశం నుంచి కొంటాం.
Petrol rates in India
మార్చిలో ధరల పెంపు
దేశీయ ఇంధన ధరలను అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుసంధానం చేసి, ఏరోజు కారోజు మార్పు చేస్తున్నారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, గత 110 రోజులుగా ఎటువంటి సవరణా చేయలేదు. బ్యారెల్ ధర 82-83 డాలర్ల స్థాయిలో ఉన్నప్పుడు అమలు చేసిన ధరలే ఇప్పుడూ అమలవుతున్నాయి. ఇప్పటివరకు బ్యారెల్ ధర 14 డాలర్లు పెరిగింది. ధరలను స్థిరంగా ఉంచిన కాలంలో చమురు కంపెనీలకు అయిన అదనపు వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.8-9 పెంచవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- 1 డాలరుకు: ముడి చమురు ధర 1 డాలరు పెరిగితే.. దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధర 45 పైసలు వరకు పెరగొచ్చు.
స్థిరత్వానికి సవాలు
"రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం; పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశంలో ఆర్థిక స్థిరత్వానికి సవాలు విసరొచ్చు. చమురు ధరలు ఎక్కడకు వెళతాయో చెప్పడం కష్టం. ఉక్రెయిన్ పరిస్థితులు చక్కబడితేనే ఈ ఇబ్బందులన్నీ తొలగుతాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలపై నిర్ణయం తీసుకుంటాయి."
-ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
సరఫరా ఇబ్బందులు రావొచ్చు
"పెరిగిన ముడి చమురు ధరల కారణంగా సరఫరా ఇబ్బందులు రావొచ్చు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, ఇరాన్-అమెరికా చర్చల నుంచి వచ్చే వైరుధ్య నిర్ణయం, అవసరానికి తగినట్లుగా చమురు ఉత్పత్తిని ఒపెక్ దేశాలు పెంచకపోవడం వంటివి చమురు ధరలపై ప్రభావం చూపొచ్చు.. ప్రస్తుతానికి రోజుకు 9 లక్షల బారెళ్ల కొరత ఉంది. ఉక్రెయిన్ పరిణామాలు అధ్వానంగా మారితే సరఫరా వైపు తీవ్ర సమస్యలు వస్తాయి."
-హెచ్‌పీసీఎల్ సీఎండీ ఎమ్‌కే సురానా
ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే పెట్రోల్ రేట్లు గణనీయంగా పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత రేట్ల పెంపు ఉంటుందని భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఎన్నికల తర్వాత బాదుడే.. పెట్రోల్ ధర ఒకేసారి రూ.8 పెంపు!