ఇప్పటికే అభివృద్ధి చేసిన కరోనా వైరస్ (కొవిడ్-19) టీకా 'కొవాగ్జిన్'పై ఒక పక్క మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తూనే, మరోపక్క ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్-19 టీకాపై పరీక్షలు ప్రారంభించటానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సిద్ధమవుతోంది. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి ఈ టీకా అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్-19 టీకాపై వచ్చే నెల నుంచి 1వ/2వ దశల క్లినికల్ పరీక్షలు మొదలుపెట్టనున్నట్లు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. 'బెల్జియం- భారతదేశాల మధ్య భాగస్వామ్యాల నిర్మాణం' అనే అంశంపై సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నిర్వహించిన ఆన్‌లైన్ చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. కేన్సర్ బాధితులు, పిల్లలు, గర్భిణిలకు ఇతర పద్ధతుల్లో ఇచ్చే టీకా కంటే, ముక్కు ద్వారా టీకా ఇవ్వటం మేలని డాక్టర్ కృష్ణ ఎల్ల వివరించారు. 'కొవాగ్జిన్' టీకాను ఇన్-యాక్టివేటెడ్ లైవ్ వైరస్ టెక్నాలజీ(ఇది దాదాపు మూడు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం)తో అభివృద్ధి చేసినట్లు, దీన్ని తమ బీఎస్‌ఎల్-3 ప్రొడక్షన్ యూనిట్లో తయారు చేస్తున్నామని అన్నారు. బీఎస్‌ఎల్-3 ల్యాబ్స్ పలు దేశాల్లో ఉన్నాయి కానీ, బీఎస్‌ఎల్-3 ప్రొడక్షన్ యూనిట్లు మాత్రం లేవని ఆయన వివరించారు. ఈ రెండు టీకాలే కాకుండా యూఎస్‌లోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియాతో కలిసి మరొక టీకా తయారీలోనూ భారత్ బయోటెక్ క్రియాశీలకంగా ఉంది. ఈ టీకా వృద్ధులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. కోల్డ్‌చైన్ పద్ధతిలో వర్ధమాన దేశాలకు భారతదేశం నుంచి టీకా పంపిణీ చేయటం ఎంతో కష్టమైన పనిగా పేర్కొంటూ, అందుకు సమర్థమైన సరకు రవాణా సదుపాయాలు ఉండాలని విశ్లేషించారు. ఇక్కడే బెల్జియం క్రియాశీలకమైన పాత్ర పోషించగలదని తెలిపారు. హైదరాబాద్ నుంచి ల్యాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు కొవిడ్-19 టీకా సరఫరా చేయటంలో బెల్జియం విమానాశ్రయాలు వారధిగా ఉపయోగపడాలని డాక్టర్ కృష్ణ ఎల్ల సూచించారు.
రెండు యూనిట్లు నిర్మిస్తున్నాం
'కొవాగ్జిన్'ను పెద్దఎత్తున తయారు చేయటానికి వీలుగా మరో రెండు యూనిట్లు నిర్మిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్ల వివరించారు. మంగళవారం రాత్రి టై- గ్లోబల్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఒక నెల రోజుల వ్యవధిలో ఈ యూనిట్లు సిద్ధం అవుతాయని, తద్వారా పెద్ద సంఖ్యలో కొవాగ్జిన్ టీకా తయారు చేయగలుగుతామని తెలిపారు. ఎన్ని డోసులు చేయగలుగుతామనేది ఈ యూనిట్లు అందుబాటులోకి వచ్చాక చెప్పగలుగుతామని వివరించారు. కొవిడ్-19 టీకాను తక్కువ ధరకే అందించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 2021లో భారీగా పెరగనున్న నియామకాలు!