ఫోన్ కొనడం, విహారయాత్రకు వెళ్లడం, స్కూలు ఫీజులు, స్వల్పకాలిక రుణాల చెల్లింపులు, బైక్ కొనడం వంటివి స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల కిందకు వస్తాయి. అయితే, ఇలాంటి వాటి కోసం ఎక్కడ మదుపు చేయాలన్నది ఓ పెద్ద చిక్కు ప్రశ్న. మరి ఈ లక్ష్యాలను ఎలా వర్గీకరించాలి? వాటిలో ఎలా మదుపు చేయాలో చూద్దాం!
స్వల్పకాలిక లక్ష్యాలను రెండు అంశాల ఆధారంగా నిర్ణయిస్తాం. ఒకటి కాలపరిమితి అయితే.. మరొకటి దాని ప్రాముఖ్యత. వీటిని పట్టిక రూపంలో అర్థం చేసుకుందాం.
లక్ష్యం | కాలపరిమితి | ఉదాహరణ |
అత్యవసరం | 0-3 నెలలు | అనారోగ్యం, ఇంటి మరమ్మతులు, అత్యవసర కొనుగోళ్లు |
అల్ట్రా షార్ట్ | 04-12 నెలలు | స్కూల్ ఫీజు,అడ్వాన్స్ ట్యాక్స్, ఖరీదైన ఫోను... |
షార్ట్ టర్మ్ | 13-36 నెలలు | విహారయాత్ర, గృహరుణ వాయిదాలు, ఈక్విటీల్లో మదుపు |
- ఇక వీటిలో మళ్లీ ఆ లక్ష్యాల ప్రాముఖ్యతను బట్టి అతి ముఖ్యం, ముఖ్యం కానివిగా కూడా వర్గీకరించుకోవచ్చు.
లక్ష్యం | కాలపరిమితి | ముఖ్యమైనవి | ముఖ్యం కానివి |
అత్యవసరం | 0-3 నెలలు | అనారోగ్యం, ఇంటి మరమ్మతులు | అత్యవసర కొనుగోళ్లు |
అల్ట్రా షార్ట్ | 04-12 నెలలు | స్కూల్ ఫీజు,అడ్వాన్స్ ట్యాక్స్ | ఖరీదైన ఫోను |
షార్ట్ టర్మ్ | 13-36 నెలలు | గృహరుణ వాయిదాలు | విహారయాత్ర, ఈక్విటీల్లో మదుపు |
- పెట్టుబడి పెట్టేటప్పుడు కాలపరిమితి, ప్రాముఖ్యత రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు అత్యవసరం, ముఖ్యమైన కేటగిరీలోకి వచ్చే అంశాల కోసం ముందుగా పెట్టుబడి పెట్టాలి. అలాగే వీటి విషయంలో నష్టభయాన్ని పూర్తిగా నివారించడమే మేలు. సురక్షితమైన, కచ్చితమైన రాబడినిచ్చే పథకాల్లో మాత్రమే మదుపు చేయాలి.
ఎలాంటి పథకాల్లో మదుపు చేయాలి..
స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మదుపు చేసేటప్పుడు మూడు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి.
1. మూలధన భద్రత: ఎలాంటి ఊహాజనిత రాబడినిచ్చే పథకాల్లో మదుపు చేయొద్దు. నష్టభయం చాలా తక్కువ ఉండాలి. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్లలో ఓవర్‌నైట్, లిక్విడ్ వంటి పథకాలు ఉన్నాయి. ఇంకా భద్రత కావాలనుకుంటే బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లను పరిగణనలోకి తీసుకోవచ్చు.
2. లభ్యత, అందుబాటు: ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేందుకు అందుబాటులో ఉండాలి. పైగా మనం చేసిన పెట్టుబడి వీలైనంత వరకు మనకు తిరిగి నగదు రూపంలోనే లభించేలా ఉండాలి. ఉదాహరణకు బ్యాంకు పొదుపు ఖాతాల్లోని డబ్బును ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. మరీ అవసరమైతే ఆన్‌లైన్‌లో కూడా బదిలీ చేయవచ్చు. తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్, డెట్ మ్యూచువల్ ఫండ్ల నుంచి కావాలనుకున్నప్పుడు నగదును ఉపసంహరించుకోవచ్చు.
3. రాబడి: ఇతర మదుపు పథకాలతో పోలిస్తే ఎక్కువ రాబడి ఇచ్చేవి అయి ఉండాలి. పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రస్తుతం తక్కువగా ఉన్న నేపథ్యంలో వీటి కంటే కొంత ఎక్కువ మొత్తంలో రాబడి ఇచ్చే పథకాల్ని ఎంచుకుంటే మేలు. అయితే, భద్రత, లభ్యతను మాత్రం విస్మరించొద్దు. ఎక్కవ రాబడి ఉందంటే.. ఎక్కువ నష్టభయం కూడా ఉండే అవకాశం ఉంది. పైగా పన్నులు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.
ఇలా మదుపు చేయండి..
1. ప్రతి రూపాయిని మీ లక్ష్యం కోసం మదుపు చేయండి. దీనికోసం పైన చూపిన విధంగా పట్టికను రూపొందించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, మీ లక్ష్యాలు ఆచరణసాధ్యం, అవసరం, వాస్తవికంగా, నిర్దేశిత కాలపరిమితిలో చేరుకునేలా ఉండాలి.
2. ప్రతి లక్ష్యానికి సరిపడా మదుపు పథకాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు 2-3 నెలల్లో చేరుకోవాల్సిన, ముఖ్యమైన కేటగిరీలోకి వచ్చే అనారోగ్యం, ఇంటి మరమ్మతుల వంటి లక్ష్యాల కోసం పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఓవర్‌నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. ముఖ్యంకాని, 2-3 ఏళ్ల సమయం ఉన్న లక్ష్యాలకు ఎక్కవ రాబడినిచ్చే షార్ట్ టర్మ్, మనీ మార్కెట్ ఫండ్ వంటి మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు.
ఇదీ చూడండి: Education Loan: విద్యా రుణం సులభంగా చెల్లించండిలా..!