రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్న ఓటర్ల తుది జాబితా ఇవాళ విడుదల కానుంది. జనవరి 11న విడుదలైన జాబితా అనంతరం నమోదు, తొలగింపు చేసుకునేందుకు ఈసీ అవకాశం కల్పించింది. అన్నిదరఖాస్తుల తనిఖీలు పూర్తి చేసుకుని నేడు మధ్యాహ్నం 3 గంటలకు తుది అనుబంధ జాబితా విడుదల చేయనుంది. కొత్తగా 25లక్షల మంది ఓటర్లు చేరే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
తొలగించినవి లక్షా 42 వేలు
ఓట్ల తొలగింపునకు సుమారు 12లక్షల 50వేల దరఖాస్తులు రాగా... సునిశిత పరిశీలన అనంతరం లక్షా 42వేల ఓట్లు తొలగించామని ఎన్నికల అధికారి వెల్లడించారు. ప్రస్తుత ఓటర్ల సంఖ్య 3 కోట్ల 93 లక్షలకు చేరిందని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ ఐదో తేదీలోగా కొత్త ఓటరు కార్డులు పంపిణీ చేయనున్నారు.
అవాస్తవ ఫిర్యాదులే ఎక్కువ
ఎన్నికల సంఘానికి సి-విజిల్ యాప్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం తప్పుడు సమాచారం ఉంటోందని ఈసీ వెల్లడించింది. సి-విజిల్ యాప్ ద్వారా 2100 ఫిర్యాదులు రాగా....వాటిలో సుమారు 900 మాత్రమే వాస్తవంగా ఉన్నాయని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.
పారదర్శకంగా...
రాష్ట్రంలో ఎన్నికల పరిశీలన కోసం 75 మంది సాధారణ పరిశీలకులు, 13 పోలీసు పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం పంపింది. రాష్ట్రంలో 102 మంది పరిశీలకులు ఆయా నియోజక వర్గాలలో పర్యటిస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.