ప్రతిపక్షనేత చంద్రబాబు.. విమానాశ్రయంలో భద్రతా తనిఖీల వ్యవహారం రాష్ట్ర పరిధిలోకి రాదని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. విమానాశ్రయ తనిఖీలు పూర్తిగా కేంద్ర పరిధిలో ఉంటాయని చెప్పారు. విమానాశ్రయంలో భద్రతా అంశాలు కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోందన్న ఆయన వ్యక్తిగత భద్రతా అంశాలను కేంద్రం నియమించిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తోందని బుగ్గన శాసనసభకు వివరించారు. చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో తనిఖీ చేసిన వ్యవహారంపై శాసనసభలో తెలుగుదేశం, వైకాపా సభ్యుల మధ్య తీవ్రస్థాయి చర్చకు కారణమైంది. చంద్రబాబు భద్రత విషయంలో ఆయన కంటే తెదేపా నేతలే అతిగా స్పందించి... చంద్రబాబును అవమానపరిచారని వైకాపా సభ్యులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు భద్రతా విషయంలో ప్రభుత్వం సరైన ప్రోటోకాల్ పాటించలేదని విశాఖ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై సమాధానమిచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి...తమ పరిధిలో లేదన్నారు.
ఇదీ చదవండి : రైతులకు అన్యాయం చేస్తే సహించం: చంద్రబాబు