ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నవలల పోటీలో ప్రముఖ రచయత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల "‘కొండపొలం"’ బహుమతి గెలుచుకుంది. 2019 సంవత్సరానికి నిర్వహించిన ఈ పోటీలో బహుమతి కింద రూ.2 లక్షలు రచయితకు అందిస్తారు. తెలుగు నవలలకు ప్రోత్సాహం అందించడానికి తానా..1997లో తొలిసారి నవలల పోటీ నిర్వహించింది. అందులో చంద్రలత ‘రేగడివిత్తులు’ నవల 1.30 లక్షల పూర్తి బహుమతి గెలుచుకుంది. 2007 వరకూ అవార్డులు ఇచ్చారు. ఆ తర్వాత.. 2017 నుంచి మళ్లీ .. నవలా పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించారు. 2019కి వెంకటరామిరెడ్డి నవల రూ.రెండు లక్షల పూర్తి బహుమతి దక్కించుకుంది. తెలుగు నవలకు సంబంధించి ఇప్పటి వరకూ ఇదే అతి పెద్ద బహుమతి.
సాహితీ ప్రస్థానం
కడప జిల్లా బాలరాజుపల్లెకు చెందిన వెంకటరామిరెడ్డి ఉపాధ్యాయవృత్తిలో కొనసాగుతూ అదే గ్రామం నుంచి నిరంతర సాహితీ సేద్యం చేశారు. ఇప్పటి వరకూ ఎనిమిది నవలలు, మూడు కథా, ఒక కవితా సంపుటాలు వెలువరించారు. 2017లో కూడా తానా నవలల పోటీలో వెంకటరామిరెడ్డి ‘'ఒంటరి'’ నవల మరో రెండు నవలలతో సంయుక్తంగా బహుమతి అందుకుంది. 2017లో రాసిన ‘చినుకుల సవ్వడి’ నవల చతుర పత్రిక బహుమతి గెలుచుకుంది. 1998లో తొలిసారి రాసిన ‘కాడి’, 2007లో వెలువరించిన తోలుబొమ్మలాట నవలలు ఆటా పురస్కారం దక్కించుకున్నాయి. ‘కొత్తదుప్పటి, బతుకు సేద్యం, సన్నపురెడ్డి కథలు’ కథా సంపుటాలు ఆయన కలం నుంచి జాలువారాయి. వెంకటరామిరెడ్డి కథలు ఇతర భాషల్లోకీ అనువాదమయ్యాయి. త్వరలోనే తానా నవలా పురస్కారాన్ని అందించడంతో పాటు.. నవలను తామే ప్రచురిస్తామని తానా అధ్యక్షులు సతీష్ వేమన, నవలల పోటీ కార్యనిర్వాహకులు డాక్టర్ జంపాల చౌదరి, ప్రచురణల కమిటీ అధ్యక్షులు చంద్ర కన్నెగంటి తెలిపారు