ఫిబ్రవరి 25 లోపు తమ ఎదుట హాజరుకావాలని ట్విట్టర్ సీఈవోకు సమన్లు జారీ చేసింది ఐటీ రంగంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ. గత గడువు ఫిబ్రవరి 11న హాజరుకానందున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు చెందిన జూనియర్ అధికారులతో సమావేశమయ్యే అవకాశం లేదని తేల్చిచెప్పింది.
సంస్థ సీఈవో జాక్ డార్సీతో పాటు ఇతర సీనియర్లు హాజరుకావాలని పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ అనురాగ్ ఠాకుర్ పేర్కొన్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార సరళిలో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సామాజిక మాధ్యమాల్ని హెచ్చరించింది కేంద్రం. అందులో భాగంగానే ట్విట్టర్ వర్గాల్ని తమముందు హాజరు కావాలని పిలిచింది. దీనిపై ట్విట్టర్ ఇంకా ఏ సమాధానమివ్వలేదు.
ఫిబ్రవరి 11న ట్విట్టర్ వర్గాలు హాజరు కావాల్సి ఉండగా తక్కువ సమయం కారణంగా హాజరు కాలేమని తొమ్మిదో తేదిన సమాధానమిచ్చాయి. ఐటీ చట్టానికి విరుద్ధంగా పోస్టులు చేయడం, వ్యక్తిగత ఖాతాల్లోని సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి కార్యకలాపాలపై కొద్ది రోజులుగా ఉక్కుపాదం మోపుతోంది కేంద్రం.