సార్వత్రిక ఎన్నికల ఓటమితో.. నీరసించిపోయిన తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు.. వేరు కుంపటి పెట్టారు. పార్టీ నుంచి దూరం జరిగారు. తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించమంటూ.. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ అందించారు. తెదేపా రాజ్యసభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్ తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ.. లేఖ ఇచ్చారు. తెలుగుదేశానికి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలుండగా.. కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి మాత్రమే.. తెదేపాలోనే కొనసాగుతున్నారు.
ఒక్కసారే నలుగురు ఎంపీలు పార్టీని వీడిన అనూహ్య పరిస్థితుల్లో తెదేపా దిగ్భ్రాంతికి గురైంది. సార్వత్రిక ఎన్నికల ఓటమితో.. తెదేపా లక్ష్యంగా ఆపరేషన్ టీడీపీ మొదలవుతుందనే ఊహాగానాలు ఉన్నప్పటికీ.. ఒకేసారి నలుగురు బయటకు వెళ్లిపోతారని పార్టీ అంచనా వేయలేకపోయింది. ఇలాంటి పరిస్థితిలో.. తాజా పరిణామం తెదేపాకు ఓ రకంగా దారుణమైన దెబ్బే.
కలిసిరాని రాజ్యసభ
'పెద్ద'లెప్పుడూ.. తెదేపాకు అంత నమ్మకంగా లేరు. పిలిచి పదవులు ఇస్తే.. పార్టీని మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన వారే ఎక్కువ. పార్టీ తొలినాళ్ల నుంచీ ఇదే పరిస్థితి. తెలుగుదేశం ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించిన పర్వతనేని ఉపేంద్ర.. ఆ తర్వాత పార్టీలో జరిగిన పరిణామాలతో పార్టీని వీడిపోయారు. తాను వెళ్లడమే కాకుండా.. మరికొంతమంది ఎంపీలను తన వెంట తీసుకెళ్లి అప్పుడు మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వానికి మద్దతు పలికారు.
ఇలా పదవి పొంది.. అలా వెళ్లి...
టీడీపీని వీడిన మరో నేత.. జయప్రద. సినీరంగం నుంచి నేరుగా రాజ్యసభలోకి వెళ్లిన నటి జయప్రద కూడా ఆ తర్వాత టీడీపీని విడిచి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉన్న నటుడు మోహన్‌బాబు ఎంపీ.. (రాజ్యసభ) అనిపించుకున్నారు. ఆ తర్వాత... పార్టీ అధినేత చంద్రబాబుతో విబేధించి.. బహిష్కరణకు గురయ్యారు. కడప జిల్లా నుంచి ముగ్గురు నేతలకు.. రెండు దఫాలు రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తే.. ముగ్గురూ పార్టీని వదిలి వెళ్లిపోయారు.
ప్రాధాన్యత ఇచ్చినా...
పార్టీలో రాజ్యసభ కోసం.. విపరీతమైన పోటీ నెలకొని ఉన్న తరుణంలో చంద్రబాబు రెండు సార్లు.. సి. రామచంద్రయ్యకు అవకాశం ఇచ్చారు. అయితే ఆయన పార్టీని వీడి అప్పట్లో ప్రజారాజ్యంలో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మైసూరారెడ్డికి చంద్రబాబు రెండుసార్లు అవకాశం కల్పించారు. ఆయన కూడా.. తెదేపాకు బైబై చెప్పి.. అప్పట్లో జై జగన్ అన్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదే జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సి.ఎం. రమేష్ కూ తెదేపా అధినేత రెండు సార్లు రాజ్యసభ అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడూ.. గుడ్ బై చెప్పేశారు.
కేంద్ర మంత్రిని చేసినా...
ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి.. బయటకు వెళ్లిపోయి మళ్లీ వచ్చిన టీజీ వెంకటేష్ కు.. పార్టీలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కాదని.. చంద్రబాబు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయనా వెళ్లిపోయారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వంతో పాటు.. కేంద్ర మంత్రిపదవి కూడా కల్పించిన తెదేపాను.. సుజనాచౌదరి వదిలేశారు. మొదటి నుంచి తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా మెలిగి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న గరికపాటి రామ్మోహనరావు సైతం పార్టీని వదిలారు. భాజపాలో చేరారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వంగాగీత, తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గుండు సుధారాణి కూడా తెదేపాలో రాజ్యసభ సభ్యత్వం పొంది.. తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరొక పార్టీలోకి వెళ్లిపోయారు.
ఇంకెందరు?
ఈ కోవలో.. ఇంకెవరైనా తెదేపాను వీడనున్నారా? అన్నది రాష్ట్ర స్థాయిలోనే కాదు.. జాతీయంగానూ చర్చనీయాంశమైంది.