'ఈవీఎంల భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవు' - ap general election 2019
ఎన్నికల విధుల్లో విఫలమైన అధికారులపై విచారణ కొనసాగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నెల్లూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో జరిగిన ఘటనలపై సంబంధిత సిబ్బందిపై చర్యలకు... ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదిక కోరామని ఈసీ అన్నారు.

పోలింగ్ తర్వాత తలెత్తిన వివాదాల్లో ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఈవీఎంల భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలను కదిలించవద్దని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంపుపై డీజీపీ నివేదిక కోరినట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో బయటపడిన వీవీప్యాట్ స్లిప్పుల ఘటనపై కేసు నమోదు ఈసీ ఆదేశించింది. ఆత్మకూరు ఆర్వో, ఏఆర్‌వోపై క్రిమినల్ కేసులు పెట్టాలని నెల్లూరు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి : విశాఖ నుంచి ముంబయికి ఎయిరిండియా సర్వీసులు