Employees Agitations Over PRC:ఉద్యోగులకు నష్టం కల్గించే పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులకు నష్టం కల్గించే జీవోలను వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్(UTF) రాష్ట్ర అధ్యక్షుడు బాబురెడ్డి కోరారు. పీఆర్సీలో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని బాబురెడ్డి ప్రకటించారు. అన్ని శాఖల ఉద్యోగులు.. ముట్టడిలో పాల్గొన్నాలన్నారు.
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా పాఠశాలల వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. తాజా పీఆర్సీ వల్ల ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతపురంలో ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయం వద్ద జీవో పత్రాలను మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ జీవోలను వెంటనే సవరించాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను దహనం చేసి ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఆ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో ఉద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్పందించి ఉద్యోగులకు అనుకూలమైన పీఆర్సీని ప్రకటించాలని కోరారు.
ఇదీ చదవండి..