ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు రైతులకు 9గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా అమలు కోసం సత్వరమే చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరా లోపాలకు తావులేకుండా చేయడంతో పాటు.. వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్, ఇంధన శాఖ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులకు సూచించారు.
రేపటినుంచి పగలు 9 గంటలు విద్యుత్..
రేపటి నుంచి 60శాతం ఫీడర్లలో వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటలపాటు పగటిపూట విద్యుత్ అందించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన 40శాతం ఫీడర్లకు 1700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తిచేయాలని.. 2020 జులై 30 కల్లా మిగిలిన 40శాతం ఫీడర్ల కింద 9 గంటలపాటు విద్యుత్ ఇవ్వాలని ఆదేశించారు.
విద్యుత్ కొనుగోళ్లపై సీఎం దృష్టి..
గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై సీఎం జగన్ దృష్టి సారించారు. తెదేపా హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. 30 అంశాలపై విచారణ చేయిస్తామని.. సీఐడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు.
రూ.2,636 కోట్లు రికవరీ..
సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లపై విస్తృతంగా చర్చించిన సీఎం.. బిడ్డింగ్ ధరలకన్నా అధిక రేట్లకు విద్యుత్ ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,636 కోట్లు నష్టం వాటిల్లిందని సమీక్షలో వెల్లడించారు. ప్రభుత్వానికి వాటిల్లిన నష్టాన్ని రికవరీ చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని.. సౌర, పవన విద్యుత్ కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలు రద్దు చేయాలని సీఎం సూచించారు. విద్యుత్ ఒప్పందాల్లో దోపిడీ స్పష్టమైందన్న సీఎం జగన్.. విద్యుత్ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, సీఎంలపై న్యాయపరమైన చర్యలకు ఆదేశించారు.