పశ్చిమ బంగాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఆ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా దీదీని ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగాన్ని బెంగాలీలో మొదలు పెట్టిన చంద్రబాబుని... ఆరాష్ట్ర ప్రజలు హర్షద్వానాలతో అభినందించారు. దేశం కోసం, పశ్చిమ బంగా ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానన్న సీఎం.... హాల్దియా నగరం దేశంలోనే అందమైన పారిశ్రామిక నగరమని కొనియాడారు.
ఏవిషయానైనా ముందు పశ్చిమ బంగా ఆలోచిస్తుంది... ఆ తర్వాత దేశం దాన్ని అనుసరిస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో బంగాల్ ఒక ప్రభావ శక్తిగా నిలిచి దేశం మీ మాట వినేలా చేయాలని ప్రజలకు సూచించారు.
నేతాజీ , విశ్వకవి రవీంద్రుడు లాంటి మహనీయులు ఎందరో జన్మించిన రాష్ట్రం బంగాల్ అని చంద్రబాబు గుర్తుచేశారు. కమ్యూనిస్టు పాలనకు ముగింపు చెప్పి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నాయకురాలు మన మమతా బెనర్జీ అని కొనియాడారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న దీదీ, ప్రధానమంత్రి మోదీ చేస్తున్న అన్యాయాలు, అరాచకాలను ఎదురిస్తూ... బెంగాల్ టైగర్ అనిపించుకున్నారని అన్నారు.
మీకు ఝార్‌గ్రామ్ ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్ కు అరుకు లోయ ఉందని చంద్రబాబు అన్నారు. ఇక్కడకు అనేక మంది పర్యాటకులు వస్తుంటారని.... ఈ ప్రాంతాలు మరింత మందిని ఆకర్షించాలంటే అభివృద్ధి చేసే ప్రభుత్వం రావాలని తెలిపారు. అందుకే మమతను మళ్లీ గెలిపించుకోండని ప్రజలకు సూచించారు చంద్రబాబు.