తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వెప్పంపట్టులో 13 వందల 81 కిలోల బంగారాన్ని ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బంగారంగా అధికారులు భావిస్తున్నారు. బంగారాన్ని సీజ్ చేసి... వాహనాన్ని పూందమల్లి తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.
సీజ్ చేసిన బంగారం.. తిరుమలేశుడిదేనా?
వెప్పంపట్టులో పట్టుబడిన బంగారంపై.. తిరుమల తిరుపతి దేవస్థానానికే చెందినదేనని తెలుస్తోంది. ఈ విషయాన్ని తితిదే వర్గాలు ఇంకా ధృవీకరించలేదు. చెన్నై పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారానికి కాలపరిమితి ముగియడంతో తిరిగి పంపించాలని తితిదే ఆ బ్యాంకును కోరింది. పీఎన్బీ నుంచే తితిదే ఖజానాకు ఆ బంగారం వస్తున్నట్టుగా భావిస్తున్నారు. పీఎన్బీ నుంచి బంగారం వస్తున్న విషయం నిజమే కానీ.. దానికి సంబంధించి.. బ్యాంకు నుంచి తమకు ఇంకా అధికారిక వర్తమానం రాలేదని తితిదే వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఎన్నికల స్క్వాడ్ సీజ్ చేసిన కంటైనర్లు.. స్విట్జర్లాండ్ నుంచి రవాణా అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు.. ఎక్కువ వడ్డీ కోసం విదేశీ బ్యాంకుల్లో ఈ బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు భావిస్తున్నారు. తితిదే వర్గాలు మాత్రం.. చెన్నై పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే డిపాజిట్ చేసినట్లుగా చెబుతున్నాయి. కాలపరిమితి ముగిసినందున నేరుగా స్విట్జర్లాండ్ నుంచే తీసుకొచ్చి తితిదేకు అప్పగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానందే అని తిరువళ్లూరు ఎస్పీ ధ్రువీకరించారు.