మరో 2 వారాలు లాక్‌డౌన్
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం మే 4నుంచి రెండు వారాలు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్పటికే విధించిన లాక్‌డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఈనెల 17వరకు లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
జోన్లవారీగా మార్గదర్శకాలు
అలాగే జోన్లవారీగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది హోంశాఖ. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిబంధనల మేరకు కొన్ని సడలింపులు చేసింది. ఏప్రిల్ 30న ఇచ్చిన మార్గదర్శకాల మేరకు రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల గుర్తింపు చేయాలని సూచించింది. వరుసగా 21 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాలు గ్రీన్ జోన్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది.