గతంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రాభవం(Congress In India) దేశవ్యాప్తంగా తగ్గుతున్నట్లు రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar On Congress) కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి 'కశ్మీర్ నుంచి కన్యాకుమారి' వరకు ఉన్న పట్టు ప్రస్తుతం లేదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు అంగీకరించాలని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ కూడా వాస్తవాన్ని సరిచూసుకోవాలని శరద్ పవార్ సూచించారు.
"వచ్చే 2024 ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఏకమవ్వాలని భావిస్తున్న ప్రతిపక్షాలకు నేతృత్వం వహించడంలో మమతా బెనర్జీ పేరు వినిపిస్తోంది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు కాంగ్రెస్ నేతలు తమకు రాహుల్ గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో తన సహచరులు కూడా నాయకత్వం విషయంలో వేరే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా లేరు"
-శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత.
దేశంలో కాంగ్రెస్ పరిస్థితి గతంలో మాదిరిగా లేదని పవార్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు అంగీకరించాలని అభిప్రాయపడ్డారు. అయితే, అహంకార పూరిత చర్యల వల్లే కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి ఏర్పడిందా? అన్న ప్రశ్నకు.. ఓ 'జమీందార్' కథను(Sharad Pawar Story) వినిపించారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈ విధంగా స్పందించారు.
"ఉత్తర్‌ప్రదేశ్ జమీందార్లకు భారీ మొత్తంలో భూములు, పెద్ద పెద్ద ప్యాలెస్‌లు ఉండేవి. పొద్దున్నే లేచి ఆ పచ్చని పొలాలను చూపిస్తూ ఆ భూమంతా తనదేనని జమీందార్ చెప్పుకొనేవారు. ల్యాండ్ సీలింగ్ చట్టం కారణంగా వేల ఎకరాల నుంచి అవి 15 లేదా 20 ఎకరాలకు తగ్గిపోయాయి. వ్యవసాయ భూముల నుంచి వారికి వచ్చే ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ప్యాలెస్‌లు మాత్రం మిగిలి ఉన్నాయి. కానీ, వాటిని బాగు చేయించి, నిర్వహించుకునే సామర్థ్యం మాత్రం జమీందార్లకు లేదు"
-శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత.
కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ప్రస్తావిస్తూ శరద్ పవార్ ఈ విధంగా సెటైర్ వేశారు.
ఇదీ చూడండి