YSRCP For Kapu Votes: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కాపులు పెద్దసంఖ్యలో ఉన్నారు. తెలుగుదేశం- జనసేన పొత్తు ఖరారవ్వడంతో పవన్‌కల్యాణ్ ప్రభావం ఆయా జిల్లాల్లోని కాపు ఓట్లపై తీవ్రంగా ఉండనుందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. కీలకమైన జిల్లాలు కావడంతో ఆ గండం నుంచి గట్టెక్కేందుకు కీలకమైన కాపు నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించింది.
కాపు సామాజికవర్గంలో కీలకంగా ఉన్న వంగవీటి రాధతోపాటు ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి తీసుకొచ్చే వ్యూహాన్ని పన్నింది. అయితే గత ప్రభుత్వం కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్‌ను వైఎస్సార్సీపీ ఎగ్గొట్టడమే గాక కాపుల రిజర్వేషన్‌లను బీసీలకు లింకుపెట్టి మరింత జఠిలం చేసింది. మరోవైపు కాపులు అత్యంత ఇష్టపడే పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ వ్యక్తిగత దూషణలకు దిగడంపై ఆ సామాజికవర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది.
'కాపు రిజర్వేషన్.. ఓట్లు దండుకునే మంత్రదండంగా మారింది'
స్వయంగా ముఖ్యమంత్రి జగనే పదే పదే పవన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇవన్నీ కాపు ఓట్లపై ప్రతికూల ప్రభావం చూపబోతున్నాయి. దీంతో వైఎస్సార్సీపీ అధినాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే రాధ, ముద్రగడలతో సంప్రదింపులు చేస్తోంది. కాపు ఓట్ల కోసమే పవన్ ఫ్యాక్టర్‌ను తగ్గించే వ్యూహాన్ని వైఎస్సార్సీపీ కొంతకాలంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నాయకులు పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేస్తున్నారు.
ఇంకోవైపు ఆయన పట్ల కాపుల్లో వ్యతిరేకత వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకొనేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకే రాధ, పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకొచ్చి పవన్ ఫ్యాక్టర్‌ను కొంతవరకైనా తగ్గించవచ్చనేది వైఎస్సార్సీపీ అంచనా. అయితే రాధా వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వకపోగా ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేయలేదు. ఆయన ఒక చోట పోటీకి సిద్ధమైతే మరోచోటకు వెళ్లాల్సిందేనంటూ దూరం పెట్టారు.
ఇదేం సామాజిక న్యాయం- అన్నిటా జగన్ సొంత నేతల ఆధిపత్యమే! పార్టీలో ఉక్కిరిబిక్కిరవుతున్న నేతలు
అవమానాలు భరించలేకే ఆయన వైఎస్సార్సీపీను వీడారు. అప్పుడు పవన్ కూడా తెలుగుదేశంతో కలిసి లేకపోవడంతో రాధా బయటకు వెళ్లిపోతున్నా వైఎస్సార్సీపీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనసేన బలపడటమేగాక కాపు సామాజికవర్గం ఆయనను ఓన్ చేసుకుంటోంది. గత్యంతరం లేక గతంలో అవమానించి పంపిన వంగవీటి రాధను బ్రతిమాలుకుని మళ్లీ పార్టీలోకి తెచ్చుకునేందుుక వైఎస్సార్సీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
రాధకు మంచి స్నేహితుడైన కొడాలి నాని ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. గుడివాడలోనూ కాపులు నిర్ణయాత్మక పాత్ర పోషించనుండటంతో అక్కడ కొడాలికి ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాధను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయన శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కాపుల రిజర్వేషన్లకు ఎగ్గొట్టడమేగాక, పవన్ కల్యాణ్‌ను నిరంతరం అడ్డగోలుగా తిడుతున్న వైఎస్సార్సీపీ మరోవైపు కాపు నేతలను పార్టీలోకి తెచ్చుకునేందుకు తాపత్రయపడటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
బీసీలకు ఇబ్బంది లేకుండా 5 శాతం కాపు రిజర్వేషన్లు : నారా లోకేశ్
రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీచేస్తానని ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాకినాడ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై పవన్ తీవ్ర విమర్శలు చేయగా కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబమే దన్నుగా నిలిచిందని, ఆయనను విమర్శించడం తగదని పవన్‌కు ముద్రగడ లేఖ రాశారు. కాపు ఉద్యమంలో మీరేం చేశారంటూ పవన్‌పై ఆయన విరుచుకుపడడం కూడా వైఎస్సార్సీపీ వ్యూహంలో భాగమేనంటున్నారు.
తొలుత ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని భావించినా ఇప్పుడు ఆయన కుమారుడు చల్లారావుకు కాకినాడ లోక్‌సభ సీటు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. లేదా కాకినాడ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సీటును ముద్రగడ కోరితే ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటుతో పాటు ఆయన సోదరికి గుంటూరు, ఏలూరు జిల్లాల మధ్య ఏదో ఒకచోట వైఎస్సార్సీపీ టికెట్ ఖరారు చేసే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది.