MP Avinash Anticipatory Bail Petition: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అవినాష్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని.. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు.
‘‘వివేకా హత్య కుట్ర అవినాష్‌రెడ్డికి ముందే తెలుసు. గత నాలుగు విచారణల్లో ఆయన సహకరించలేదు. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించాం. హత్యకు ముందు.. ఆ తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్, ఉదయ్ ఉన్నారు. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి. హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్‌రెడ్డి జమ్మలమడుగుకు దగ్గర్లో ఉన్నట్లు చెప్పారు. మొబైల్ సిగ్నల్స్ చూస్తే ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాత్రంతా తన ఫోన్‌ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించాం’’ అని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.
వివేకా హత్యకేసులో విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్ తేలే వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు. ‘‘వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దస్తగిరి వాంగ్మూలం మేరకు నన్ను ఇరికించాలని సీబీఐ చూస్తోంది. నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశంలో సీబీఐ ఉంది. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను తెరపైకి తెచ్చింది. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదు. నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.. ఒకవేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీబీఐని ఆదేశించాలి’’ అని బెయిల్ పిటిషన్‌లో అవినాష్‌రెడ్డి వెల్లడించారు.
ఇదిలావుండగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అవినాష్‌ను విచారిస్తామన్న సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్ రెడ్డిని విచారిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. మధ్యాహ్నం తర్వాత విచారణ మొదలుకాగా.. సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టుకు వస్తున్నారని వైఎస్ వివేకా కుమార్తె సునీత కోర్టుకు తెలిపారు. అవినాష్ ప్రమేయంపై నిందితులు, సాక్ష్యులు సీబీఐకి చెప్పారని వెల్లడించారు.
అనంతరం అవినాష్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్‌పై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. దర్యాప్తులో గూగుల్ టేకౌట్ డేటాపై ఆధారపడటం తగదన్నారు. సునీల్ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ డేటా విరుద్ధంగా ఉన్నాయన్నారు. దస్తగిరి చెప్పింది తప్పా.. గూగుల్ డేటా తప్పా..? అని కోర్టుకు సూచించారు. వివేకా హత్యకు కుటంబ, వివాహేతర, ఆర్థిక వివాదాలు కారణమై ఉండొచ్చని కోర్టుకు తెలిపారు. నేటి సీబీఐ విచారణపై స్పష్టత ఇవ్వాలని అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు. సాయంత్రం అవినాష్ విచారణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే దీనిపై స్పందించిన సీబీఐ.. అవినాష్‌రెడ్డిని రేపు విచారణకు పిలుస్తామని కోర్టుకు తెలిపింది. కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు పిలుస్తామని సీబీఐ తెలిపింది.
బంధువు కనుక హత్యాస్థలానికి వెంటనే వెళ్లినట్లు అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. గుండెపోటు అని ఎందుకు చెప్పారని హైకోర్టు ప్రశ్నించగా.. అక్కడున్న వారు చెబితే అదే విషయం చెప్పినట్లు అవినాష్ న్యాయవాది స్పష్టం చేశారు. వాదనలు విన్న అనంతరం కోర్టు ఈనెల 25 వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: