ప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిపై పుడుతుందో తెలియదు. ప్రేమకు వయసు, కులం, మతం, హోదాతో సంబంధం లేదు అనే మాటలు చాలా సార్లు విన్నాం. చాలా రకాల ప్రేమ జంటలు ఈ నానుడిని నిజం చేసి చూపించాయి. ప్రేయసి కోసం ప్రియుడు ఏమైనా చేస్తాడంటారు. అయితే ఇదే రీతిలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకోగా ఇప్పుడు ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్ ఆజంగఢ్ జిల్లాకు చెందిన వీరూ రాజ్‌భర్(24), ఓ ట్రాన్స్ జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. రెండేళ్లుగా ప్రేమాయణం సాగించిన వీరిద్దరూ శుక్రవారం పెళ్లి పీఠలెక్కారు. జిల్లాలోని భైరోధం ఆలయ ప్రాంగణంలో, హిందూ ఆచారాల ప్రకారం వేద మంత్రాల సాక్షిగా ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్నాడు యువకుడు. బంగాల్‌లోని జల్‌పైగురి నివాసి అయిన ముస్కాన్ కిన్నార్ అనే ట్రాన్స్ జెండర్ 2 ఏళ్ల క్రితం బ్రాస్ బ్యాండ్ పార్టీలో నృత్యం చేయడానికి మౌకి వచ్చింది. అక్కడ ముస్కాన్.. మౌలోని టెకై గ్రామానికి చెందిన వీరూ రాజ్‌భర్‌ను కలిసింది. వారి మొదటి మీటింగ్‌లోనే ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరూ లివ్ఇన్ రిలేషన్ షిప్లో ఉండేందుకు నిర్ణయించుకుని.. దాదాపు రెండేళ్లుగా కలిసి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. దీనికి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడం వల్ల ఇద్దరూ భైరోధం గుడిలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
![youth-married-eunuch-bride-in-uttar pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17164541_vdcbdfb.jpg)
![youth-married-eunuch-bride-in-uttar pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17164541_hbdfhdf.jpg)
వేదమంత్రాల సాక్షిగా.. నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని ఒకరికొకరు ప్రమాణాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరూ మాట్లాడుతూ.. "నేను ఓ ట్రాన్స్ జెండర్‌ను వివాహం చేసుకున్నాను. ఇందుకు మా కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం తెలుపలేదు. మా కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ రోజు మా పెళ్లి జరిగింది" అని అతడు చెప్పాడు. మరోవైపు కొత్త పెళ్లికూతురైన ముస్కాన్.. ప్రియుడైన వీరూతో తనకు వివాహం జరగడం వల్ల చాలా ఆనందంగా ఉన్నానని అంటోంది.
![youth-married-eunuch-bride-in-uttar pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17164541_gdgdf.jpg)