బోల్తా పడిన రైలు దగ్గర ఫొటో.. ఒకరు మృతి.. జలపాతం వద్ద మరొకరు.. - తమిళనాడు న్యూస్
జలపాతం వద్ద ఫొటో దిగుతూ ఒకరు గల్లంతైన ఘటన తమిళనాడు దిండిగుల్లో జరిగింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బిహార్‌లో జరిగిన మరో ఘటనలో బోల్తా పడిన రైలు బోగీ వద్ద ఫొటో దిగుతున్న ఇద్దరు యువకులకు హైటెన్షన్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
తమిళనాడు దిండిగుల్‌లోని పుల్లవేలి జలపాతంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పుల్లవేలి జలపాతానికి పర్యటకులు తాకిడి ఎక్కువైంది. పరమకుడికి చెందిన అజయ్ పాండ్యన్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూడడానికి వచ్చాడు. జలపాతం అంచున నిలబడి ఫొటోకు ఫోజూ ఇస్తున్న అజయ్. ప్రమాదవశాత్తు కాలు జారి వందల అడుగుల లోతులో పడిపోయాడు.
స్నేహితుడు కేకలు వేయడం వల్ల అప్రమత్తమైన యాత్రికులు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ఐదు గంటల పాటు గాలింపు చేపట్టినా.. అజయ్ ఆచూకీ లభించలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతకుముందు స్నేహితుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బోల్తా పడిన రైలుతో సెల్ఫీ- యువకుడు మృతి: బిహార్ నలంద జిల్లాలో హైటెన్షన్ వైర్లు తగిలి ఓ యువకుడు మరణించాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బోల్తా పడిన గూడ్స్ రైలు వద్ద ఫొటోలు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఝార్ఖండ్ నుంచి పట్నా వెళ్తున్న 8 బోగీల గూడ్సు రైలు ఏకంగరసరయ్ రైల్వే స్టేషన్ వద్ద బుధవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషయం తెలిసిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి వచ్చారు. కొంతమంది యువకులు రైలు బోగీ ఎక్కి ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులకు హైటెన్షన్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన యవకులు గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుడిని కొషియావాన్ గ్రామానికి చెందిన సూరజ్ కుమార్‌గా.. గాయపడిన వ్యక్తిని గడారియాకు చెందిన ఛోటుగా గుర్తించారు.
ఇవీ చదవండి: 'మోదీకి, ఈడీకి భయపడను'.. కేంద్రంపై రాహుల్ ఫైర్.. ఖర్గేకు సమన్లు
రూ.1400 కోట్ల 'మ్యావ్ మ్యావ్' డ్రగ్స్ సీజ్.. కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్