అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న ఓ యువకుడు.. డీఎన్ఏ టెస్ట్ కారణంగా ఐదేళ్లకు నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ ఘటన బంగాల్లోని పశ్చిమ మేదినీపుర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది.. కేశ్‌పుర్ చెందిన 13 ఏళ్ల బాలిక ఐదేళ్ల క్రితం పెళ్లికాకుండానే గర్భం దాల్చింది. ఇంటి పక్కన ఉన్న యువకుడే ఇందుకు కారణమని.. బాలిక కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పంచాయితీ పెట్టారు. తాను తప్పు చేయలేదని ఆ యువకుడు చెప్పినా ఎవరూ అతడి మాట నమ్మలేదు. బాధిత యువతిని పెళ్లి చేసుకోవాల్సిందిగా గ్రామ పెద్దలు తీర్మానించారు. వారి ఒత్తిడితో 22 ఏళ్ల యువకుడు.. మైనర్‌కు 18 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకున్నాడు.
ఆమెను పెళ్లి చేసుకున్న అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు ఆ యువకుడు. తాను ఏ తప్పు చేయలేదంటూ 2017లో మేదినీపుర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆమె గర్భానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించాడు. డీఎన్ఏ పరీక్ష చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పుట్టిన బిడ్డకు, ఆ యువకుడికి పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. బాలికకు జన్మించిన చిన్నారికి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడికి ఎటువంటి సంబంధం లేదని తేలింది. దీంతో కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది.
యువకుడిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు యువతి, ఆమె తల్లిని అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేయలేదు. దీంతో యువకుడు మరోసారి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.