Young man to tie knot to two Women పెళ్లి కుమారుడు ఒక్కడే.. కానీ పెళ్లి కుమార్తెలు ఇద్దరు. అదేంటి అనుకుంటున్నారా... నిజమేనండీ.. ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై ఇద్దరినీ పెళ్లాడనున్నాడు ఓ యువకుడు. అంతేకాదు పెళ్లి పత్రికలు కూడా అందరికి పంచేశాడు. దీంతో వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇద్దరినీ ప్రేమించాడని... అంతేకాకుండా చాలా కాలంగా కాపురం కూడా చేస్తున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించి అందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన ముత్తయ్య, రామ లక్ష్మి రెండవ కుమారుడు సత్తిబాబు. వీరి గిరిజన సంప్రదాయాలు అందరితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. గిరిజన కులాల్లోని యువతి, యువకులు ఒకరిని ఒకరు ఇష్టపడితే ముందుగానే సహజీవనం చేస్తారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. సహజీవనం చేస్తున్న క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత కూడా పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు. అయితే సహజీవనం చేసినందుకు కుల పెద్దలకు, గ్రామస్థులకు కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే సత్తిబాబు డిగ్రీ వరకు చదివి మధ్యలో ఆపేశాడు. సత్తిబాబు ఇంటర్ చదువుతున్న క్రమంలో పక్క గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న స్వప్న కుమారిని ప్రేమించాడు. అదే క్రమంలో వరసకు మరదలైన సునీతను కూడా ఇష్టపడ్డాడు. గత మూడేళ్ల నుంచి ఇద్దరితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్న కుమారికి ఒక పాప జన్మించగా... సునీతకు కూడా ఒక బాబు పుట్టాడు. ప్రస్తుతం మళ్లీ ఇద్దరూ గర్భం దాల్చారు.
అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును కోరగా ఇద్దరిని ప్రేమిస్తున్నానని... ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని విషయం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ అవాక్ అయ్యారు. మూడు ఊర్ల పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి ముగ్గురి ఇష్టఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక వాళ్ల ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరితో ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కూడా అచ్చు వేయించి బంధువులందరికీ పంచారు.
ఇక బంధువులందరిని పిలిచి పందిరి ముహూర్తం జరిపించి పెళ్లి పనులు ప్రారంభించారు. గురువారం ఉదయం ఏడు గంటలకు బ్రాహ్మణులు లేకుండా కులపెద్దలు, గ్రామస్థుల సమక్షంలో ఇద్దరికీ ఒకే ముహూర్తానికి మంగళసూత్రం కట్టడానికి పనులు ప్రారంభించారు. కుల పెద్దలు మాట్లాడుతూ... వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తున్నామని అంటున్నారు. ఇద్దరు పెళ్లికూతుళ్లు అతన్నే చేసుకుంటామని... ముగ్గురం కలిసి ఉంటామని చెబుతున్నారు.
మేం ముగ్గురం ఒక్కటవుతాం. మాకేం ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అందుకే మేం కూడా ఒప్పుకున్నాం. వారి ఇష్ట ప్రకారమే.. పెళ్లి జరుగుతుంది. మూడు ఊర్లు పెద్దలు ఒప్పుకున్నారు. - గ్రామస్థులు
ఇవీ చదవండి:
అతివలు వీరిని స్ఫూర్తిగా తీసుకోండి.. అనుకున్నది సాధించండి!
సరిలేరు సంగీతకు.. చదివింది నాలుగో తరగతి.. పది మందికి ఉపాధి కల్పిస్తోంది
సాహో జుబేదా.. ఈ 'పవర్‌ఫుల్ ఉమెన్' గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే