YCP Leaders Attacks on TDP Leaders: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు మరింత ఎక్కువతున్నాయి. ముఖ్యంగా అధికారపక్షం దౌర్జన్యాలు మరింత మితిమీరాయి. నరసరావుపేటలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అవినీతి గురించి ప్రశ్నించిన తెలుగుదేశం నేత ఇంటిపై.. ఆ పార్టీశ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అడ్డుకోబోయిన తెలుగుదేశం నేతలపైనా రాళ్లదాడికి దిగారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబుతోపాటు ఆయన డ్రైవర్, పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే వైఎస్సార్సీపీ నాయకులు రెచ్చిపోయారు. తెలుగుదేశం నేత చల్లా సుబ్బారావు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి. తొలుత చల్లా సుబ్బారావు ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. ఆయన ఇంటిలోని ఫర్నిచర్, కిటికీలు ధ్వంసం చేశారు. సుబ్బారావు ఇంటికి సమీపంలోని ఓ ప్రవాసాంధ్రుడి ఇంటి వ్యవహారంపై కొన్నాళ్లుగా టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ విషయంపై తొలుత గొడవకు దిగిన వైఎస్సార్సీపీ నాయకులు.. అనంతరం ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారంటూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకుని అక్కడి చేరుకున్న టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు.
రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. కార్యకర్తపై దాడి.. వీడియో వైరల్
తెలుగుదేశం శ్రేణులు వారిని అడ్డుకోగా.. వారందరిపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దాడి జరుగుతుండగానే అక్కడి చేరుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని చూసి వైఎస్సార్సీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయాయి. టీడీపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో అరవిందబాబు డ్రైవర్ తలకు తీవ్ర గాయమైంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తలదాచుకోవడానికి వెళ్తుంటే వాటిని వెంబడించి ధ్వంసం చేశారు. కార్లు వదిలేసి వెళ్తుండగా రాళ్లు రువ్వడంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. ఎమ్మెల్యే సమక్షంలోనే వైఎస్సార్సీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని టీడీపీ నేత అరవిందబాబు ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ దాడులు : టీడీపీ నేతలు
పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా పోలీసులు సకాలంలో స్పందించలేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దాడికి పాల్పడుతున్నవారిని చెదరగొడున్న పోలీసులపైనా వైసీపీ కార్యకర్తలు ఎదురుతిరిగారు. దీంతో పోలీసులు వైఎస్సార్సీపీ వారిని వదిలేసి, టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టడంపైనే దృష్టిపెట్టారు. ఒకవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టిస్తుంటే ఎక్కువమంది పోలీసులు ఎమ్మెల్యే గోపిరెడ్డికి రక్షణగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం నేతలే ఇంటిని ఆక్రమించుకుంటే అడ్డుకున్నామని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. ఇరువర్గాలను చెదరగొట్టి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.